మద్యానికి బానిసై 26 రోజుల చికిత్స.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల తీసిన స్టార్‌ బౌలర్‌ కష్టాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్యానికి బానిసై 26 రోజుల చికిత్స.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల తీసిన స్టార్‌ బౌలర్‌ కష్టాలు!

Yuzvendra Chahal alcohol addiction and 26 days treatment star IPL bowler struggles
  • విడాకుల తర్వాత మద్యం అలవాటు మితిమీరిందన్న యుజ్వేంద్ర చాహల్‌
  • పునరావాస కేంద్రంలో 26 రోజులు గడిపినట్లు వెల్లడి
  • మానసిక ఒత్తిడితో పానిక్‌ అటాక్స్‌ ఎదుర్కొన్నానని వివరణ
  • వ్యక్తిగత జీవితంపై బహిరంగ చర్చ ఆటపై ప్రభావం చూపిందని వ్యాఖ్య
  • కుటుంబం, స్నేహితులు కష్టకాలంలో అండగా నిలిచారని వెల్లడి
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారత స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టాడు. విడాకుల తర్వాత మద్యం అలవాటు మితిమీరిందని, మానసికంగా కుంగిపోయానని తెలిపాడు. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొని పునరావాస కేంద్రంలో 26 రోజులు గడిపినట్లు వెల్లడించాడు. మాజీ భారత ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రాతో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నాడు.

‘‘మొదట్లో చిన్న వయసు.. స్నేహితులతో పార్టీలు చేసుకునేవాడిని. 2011లో తొలిసారి ఐపీఎల్‌ ఆడాను. జీవితంలో సమతూకం అవసరమని ఏబీ డివిలియర్స్‌ ఒకసారి చెప్పాడు. వినడానికి సులువుగానే అనిపించినా ఆచరించడం అంత తేలిక కాదు. విడాకుల తర్వాత పరిస్థితులు మితిమీరిపోయాయి. మానసిక స్థితి కూడా బాగాలేదు. ఇలాగే కొనసాగితే నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను కోల్పోతానని అర్థమైంది. అందుకే మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని చాహల్‌ చెప్పాడు. ఆ నిర్ణయం తన వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చిందని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకున్నానని తెలిపాడు.

వ్యక్తిగత జీవితంలోని విషయాలు బహిరంగ చర్చకు రావడం తనను బాధించిందని చాహల్‌ వెల్లడించాడు. దాని ప్రభావం ఆటపైనా పడిందన్నాడు. మానసికంగా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనందున కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో ఆందోళనతో పాటు పానిక్‌ అటాక్స్‌ కూడా ఎదురయ్యాయని వివరించాడు. గుండె వేగంగా కొట్టుకోవడం, ముఖం బిగుసుకుపోవడం, మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించేవని తెలిపాడు. తన పరిస్థితిని గుర్తించి క్రికెట్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానన్నాడు.

కుటుంబం, సన్నిహిత మిత్రులు కష్టకాలంలో తనకు అండగా నిలిచారని చాహల్‌ చెప్పాడు. మద్యానికి దూరమైన తర్వాత శారీరకంగా కూడా మెరుగయ్యానని, జిమ్‌, ఫీల్డింగ్‌ సాధనపై శ్రద్ధ పెట్టగలిగానని తెలిపాడు. ఐపీఎల్‌ 2025లో పంజాబ్‌ కింగ్స్‌ తనపై రూ.18 కోట్లు పెట్టి నమ్మకం ఉంచిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నానని చెప్పాడు. ఐపీఎల్‌లో 188 మ్యాచ్‌లు ఆడిన చాహల్‌ 233 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
Advertisement
Yuzvendra Chahal
IPL highest wicket taker
Punjab Kings IPL 2025
Yuzvendra Chahal alcohol addiction
Indian spinner rehab journey
Yuzvendra Chahal mental health

More Telugu News