రణ్‌బీర్‌ కపూర్‌ చేతికి రూ.78 లక్షల వాచ్‌.. ప్రత్యేకతలేంటో తెలుసా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రణ్‌బీర్‌ కపూర్‌ చేతికి రూ.78 లక్షల వాచ్‌.. ప్రత్యేకతలేంటో తెలుసా?

Ranbir Kapoor wears 78 lakh watch know its special features
  • బెంగళూరులో ‘రామాయణం’ ట్రైలర్‌ కార్యక్రమానికి రూ.78 లక్షల వాచ్‌తో వచ్చిన రణ్‌బీర్‌
  • జాకబ్‌ అండ్‌ కో ఎపిక్‌ ఎక్స్‌ రామ్‌ జన్మభూమి రోజ్‌ గోల్డ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ ధర రూ.78 లక్షలు
  • వాచ్‌పై రామమందిరం, విల్లుతో శ్రీరాముడు, హనుమంతుడి రూపాలు
  • నారింజ రంగు స్ట్రాప్‌, రోజ్‌ గోల్డ్‌ క్లాస్ప్‌ దీని ప్రత్యేకతలు
  • రామజన్మభూమి వాచ్‌ సిరీస్‌లో రూ.35.88 లక్షల నుంచి రూ.1.08 కోట్ల వరకు వేరియంట్లు
  • రామాయణంలో శ్రీరాముడి పాత్ర పోషించడం జీవితంలో గొప్ప అవకాశమన్న రణ్‌బీర్‌
బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ చేతికి ఉన్న రూ.78 లక్షల విలువైన వాచ్‌ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బెంగళూరులో అక్టోబర్‌ 15న జరిగిన ‘రామాయణం’ అంతర్జాతీయ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమానికి ఆయన ఈ ఖరీదైన వాచ్‌ ధరించి వచ్చారు. ఇందులో సాయిపల్లవి, రవీ దూబే, యశ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దర్శకుడు నితేశ్‌ తివారీ, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అభిమానులను పలకరించిన రణ్‌బీర్‌ కన్నడలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు కన్నడలో ఒక్క వాక్యం మాత్రమే వచ్చని, మరోసారి వచ్చినప్పుడు యశ్‌ నుంచి మరిన్ని మాటలు నేర్చుకుని వస్తానని చెప్పడంతో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సినిమాలో శ్రీరాముడి పాత్రతోపాటు పరశురాముడిగానూ రణ్‌బీర్‌ కనిపించనున్నారు.

వాచ్‌లో రామమందిరం.. హనుమంతుడి ప్రతిమ
రణ్‌బీర్‌ ధరించిన వాచ్‌ పేరు జాకబ్‌ అండ్‌ కో.ఎపిక్‌ ఎక్స్‌ రామ్‌ జన్మభూమి రోజ్‌ గోల్డ్‌ స్పెషల్‌ ఎడిషన్‌. ఎథోస్‌ వాచెస్‌ వెబ్‌సైట్‌ ప్రకారం దీని ధర రూ.78 లక్షలు. అయోధ్యలోని రామమందిరం, విల్లుతో ఉన్న శ్రీరాముడు, హనుమంతుడి రూపాలను ఈ వాచ్‌పై ప్రత్యేకంగా చెక్కారు.

డయల్‌, బెజెల్‌పై హిందూ దేవతలకు సంబంధించిన శిల్పాలు, అక్షరాలు కూడా ఉన్నాయి. ఆధునిక వాచ్‌ రూపకల్పనలో రామజన్మభూమి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. నారింజ రంగు స్ట్రాప్‌, రోజ్‌ గోల్డ్‌ క్లాస్ప్‌ దీని ప్రత్యేకతలు.

రూ.35 లక్షల నుంచి రూ.కోటికి పైగా ధర
జాకబ్‌ అండ్‌ కో ఎపిక్‌ ఎక్స్‌ కలెక్షన్‌ 2015లో ప్రారంభమైంది. ఈ కలెక్షన్‌లో భాగంగా భారతీయ చారిత్రక కట్టడాల స్ఫూర్తితోనూ ప్రత్యేక వాచ్‌లను రూపొందించారు. తాజ్‌మహల్‌, ఇండియా గేట్‌, గేట్‌వే ఆఫ్‌ ఇండియా, కుతుబ్‌ మినార్‌ వంటి కట్టడాల నమూనాలు కొన్ని వేరియంట్లలో కనిపిస్తాయి.

రామజన్మభూమి వాచ్‌ సిరీస్‌లో టైటానియం ఎడిషన్‌ ధర రూ.35.88 లక్షలు. రోజ్‌ గోల్డ్‌ ఎడిషన్‌ ధర రూ.78 లక్షలు. గోల్డ్‌ ఎడిషన్ల ధరలు రూ.83 లక్షల నుంచి రూ.1.08 కోట్ల వరకు ఉన్నాయి.

శ్రీరాముడి పాత్రపై రణ్‌బీర్‌ ఏమన్నారంటే..
‘రామాయణం’లో శ్రీరాముడిగా నటించే అవకాశం రావడం తనకు నమ్మశక్యంగా అనిపించలేదని రణ్‌బీర్‌ చెప్పారు. కోట్లాది మంది మనసుల్లో కొలువైన శ్రీరాముడి పాత్రకు న్యాయం చేయగలనా? అని తొలుత సందేహించానన్నారు. అయితే ఈ అవకాశం తన జీవితంలో మరచిపోలేనిదని, శ్రీరాముడి గురించి, రామాయణం గురించి, భారతీయ సంస్కృతి, చరిత్ర గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు దోహదపడిందని పేర్కొన్నారు. ‘రామాయణం: పార్ట్‌ 1’ ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.
Advertisement
Ranbir Kapoor
Jacob and Co Watch
Ramayana Movie Trailer
Ram Janmabhoomi Special Edition
Ayodhya Ram Mandir Watch
Ranbir Kapoor Ramayana

More Telugu News