పాక్‌-అమెరికా యుద్ధం వస్తే పాకిస్థాన్‌కే మా మద్దతు: బీజేపీ నేత వ్యాఖ్యలపై రగడ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్‌-అమెరికా యుద్ధం వస్తే పాకిస్థాన్‌కే మా మద్దతు: బీజేపీ నేత వ్యాఖ్యలపై రగడ!

  • మదన్‌ రాథోడ్‌ వ్యాఖ్యలతో రాజస్థాన్‌ రాజకీయాల్లో దుమారం
  • రాథోడ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌
  • బీజేపీ వైఖరిపై ప్రధాని మోదీని ప్రశ్నించిన ‘ఆప్‌’
  • తన వ్యాఖ్యలను వక్రీకరించారని రాథోడ్‌ ఆరోపణ
  • భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంలో మాట్లాడానని వివరణ
రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు మదన్‌ రాథోడ్‌ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అమెరికాతో యుద్ధం వస్తే పాకిస్థాన్‌కు భారత్‌ అండగా ఉంటుందని ఆయన అన్నట్లు వెలువడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తీవ్రంగా మండిపడ్డాయి. దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించాయి. అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భం నుంచి వేరుచేసి ప్రచారం చేస్తున్నారని రాథోడ్‌ వివరణ ఇచ్చారు.

జైపూర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాథోడ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌ మన పొరుగు దేశమని, అమెరికా-పాకిస్థాన్‌ మధ్య యుద్ధం వస్తే పాకిస్థాన్‌కు భారత్‌ మద్దతుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో మన దేశానికి సంబంధించిన విషయాల్లో మాత్రం భారత్‌ పక్షానే నిలవాలని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి షమా మహమ్మద్‌ తీవ్రంగా స్పందించారు. భారత సైనికులను, ప్రజలను బలిగొంటున్న పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. రాథోడ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘ఆప్‌’ సైతం ఈ వ్యాఖ్యలపై బీజేపీని నిలదీసింది. ప్రజలు ప్రశ్నిస్తే వారిని పాకిస్థానీయులుగా ముద్ర వేస్తారని, యువత గొంతెత్తితే ఉగ్రవాదులంటారని విమర్శించింది. అలాంటిది పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడిన బీజేపీ నేతల విషయంలో ప్రధాని మోదీ వైఖరేంటని ప్రశ్నించింది.

వివాదం ముదరడంతో రాథోడ్‌ స్పందించారు. తన మాటల్లోని చివరి రెండు వాక్యాలను మాత్రమే తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోతే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకునేవారు దేశభక్తులు కారనే ఉద్దేశంతో మాట్లాడానని వివరించారు. పాకిస్థాన్‌కు అమెరికా మద్దతుగా నిలిచే పరిస్థితి వేరని పేర్కొన్నారు. తనపై దురుద్దేశంతోనే వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.
Advertisement

More Telugu News