డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే: జగన్
- డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరగినట్టు ఆధారాలు ఉన్నాయన్న జగన్
- ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టారని విమర్శ
- తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మండిపాటు
రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో స్పష్టమైన అక్రమాలు, అవకతవకలు జరిగిన ఆధారాలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఒప్పుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ డీఎస్సీ నియామక చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టారని జగన్ విమర్శించారు. స్వయంగా మంత్రి నారా లోకేశ్ సభలో ఈ విషయాన్ని అంగీకరించారని, ఇలా రెండూ ఒకే వ్యక్తికి అప్పగించడమే లీకేజీలకు, డీఎస్సీ స్కామ్‌కు బీజం వేసిందని ఆరోపించారు. దీనిపై పారదర్శకత కోసం సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని అన్నారు.
ప్రశ్నాపత్రాల తయారీ విభాగంలో పనిచేసిన నవీన్ అనే వ్యక్తికి డీఎస్సీలో మొదటి ర్యాంక్ రావడంపై జగన్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మొదట నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అంగీకరించి, ఆ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదనే నెపంతో రెండో జాబితా నుంచి అతని పేరును తొలగించిందని విమర్శించారు. ఉద్యోగం రాలేదని నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడో సమాధానం చెప్పాలని, అసలు ఈ పేపర్ లీక్ నవీన్ ఒక్కడికే పరిమితమైందా లేక ఇంకా ఎంతమందికి చేరిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అబద్ధాలు చెబుతోందని, చట్టసభల్లో ప్రతిపక్షానికి తగిన సమయం ఇవ్వకుండా, కౌన్సిల్‌లో మాట్లాడకుండా దాటవేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసలు డీఎస్సీ సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.