పోలండ్‌లో గుండెపోటుతో శ్రీకాకుళం వ్యక్తి మృతి

Batsala Rambabu from Srikakulam dies of heart attack in Poland
  • ఉపాధి కోసం గతేడాది డిసెంబర్‌లో విదేశాలకు
  • చిన్న కుమార్తెను చూసుకోకుండానే కన్నుమూసిన తండ్రి
  • విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
  • మృతదేహం తరలింపునకు కేంద్రమంత్రికి వినతి
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం పోలండ్‌ దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన బత్సల రాంబాబు (37) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రాంబాబుకు భార్య లావణ్య, ఇద్దరు కుమార్తెలు బిందుశ్రీ (4), చరిష్మ (8 నెలలు) ఉన్నారు.

రాంబాబు జీవనోపాధి కోసం 2025 డిసెంబర్‌లో పోలండ్‌కు వెళ్లాడు. అతడు విదేశాలకు వెళ్లే సమయానికి భార్య లావణ్య గర్భవతి. రాంబాబు వెళ్లిన కొద్ది నెలలకే ఆమె రెండో కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 8 నెలలు. కన్నబిడ్డను ఒక్కసారి కూడా కళ్లారా చూసుకోకుండానే రాంబాబు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాంబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు సహాయం చేయాలని స్థానిక టీడీపీ నేత శివప్రసాద్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Advertisement
Batsala Rambabu
Srikakulam man death Poland
Poland heart attack news
Ram Mohan Naidu help
Santabommali Srikakulam news

More Telugu News