నిర్బంధంలో నరకం చూశా.. అమెరికాలో భారత సంగీతకారుడికి కష్టాలు

Pritesh Walia Indian musician shares harrowing experience in US detention
  • వీసా గడువు ముగిసిందన్న ఆరోపణలతో భారత సంతతి సంగీతకారుడి నిర్బంధం
  • ప్రితేష్ వాలియాను 14 రోజుల పాటు అదుపులోకి తీసుకున్న యూఎస్ అధికారులు
  • మానసికంగా కుంగిపోయానని, కుప్పకూలిపోయానని వాలియా ఆవేదన
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ జాజ్ సంగీతకారుడు ప్రితేష్ వాలియాకు చేదు అనుభవం ఎదురైంది. వీసా గడువు ముగిసిందన్న ఆరోపణలతో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయన్ను 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. కాలిఫోర్నియాలోని అడెలాంటో నిర్బంధ కేంద్రంలో గడిపిన ఆ రోజులు తనను మానసికంగా కుంగదీశాయని, భయంతో పూర్తిగా కుప్పకూలిపోయినట్లు అనిపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆగస్టు 2న లాస్ ఏంజిల్స్‌కు తిరిగి వచ్చిన సమయంలో అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. అనంతరం తనను అడెలాంటో కేంద్రానికి తరలించి 14 రోజుల పాటు నిర్బంధించారని తెలిపారు. ఇటీవల బాండ్‌పై విడుదలైన అనంతరం, ప్రితేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నారు.

"ఆ 14 రోజులు నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి. ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, స్నేహితురాలు, న్యాయవాది, సంగీత ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారు చూపిన ప్రేమ, మానవత్వంపై నాకు మళ్లీ నమ్మకాన్ని కలిగించింది" అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో పుట్టి పెరిగిన ప్రితేష్ వాలియా, చిన్న వయసులోనే భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఉన్నత సంగీత విద్యను అభ్యసించేందుకు ఆయన అమెరికా వెళ్లారు. కాగా, 27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్ వెంకట నరసమాంబ వాసంశెట్టిని కూడా ఇటీవల అధికారులు నిర్బంధించడం గమనార్హం.
Advertisement
Pritesh Walia
Indian jazz musician detained
US Immigration and Customs Enforcement
Adelanto Detention Center California

More Telugu News