వింత వ్యాధితో నీళ్లలోనే బతుకుతున్న బాలుడు.. అండగా అనంత్ అంబానీ!

Anant Ambani helps young man living in water due to rare disease
  • వింత వ్యాధితో నీటిలోనే గడుపుతున్న పశ్చిమ బెంగాల్ బాలుడు
  • సోషల్ మీడియా వీడియో ద్వారా విషయం తెలుసుకున్న అనంత్ అంబానీ
  • ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రికి ప్రత్యేక విమానంలో తరలింపు
  • ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స
  • కుటుంబం వైద్యం చేయించలేకపోవడంతో అంబానీ చొరవ
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బాలుడు వింత వ్యాధితో బాధపడుతూ నిరంతరం నీటి కుంటల్లోనే గడపాల్సి వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మానవత్వంతో స్పందించి, అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆ కుర్రాడిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించి, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన ఇక్బాల్ అనే బాలుడు గత కొంతకాలంగా ఓ అరుదైన సమస్యతో సతమతమవుతున్నాడు. నీటి నుంచి బయటకు వస్తే శరీరం తీవ్రమైన మంటలకు గురవుతుండటంతో అతను విలవిలలాడిపోతున్నాడు. ఏదో అతీతశక్తి తనను ఆవహించడం వల్లే ఇలా జరుగుతోందని అతను భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం నుంచి రాత్రి వరకు నీటిలోనే ఉంటూ, ఆహారం కూడా అక్కడే తీసుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో చూసిన అనంత్ అంబానీ.. ఇక్బాల్ పరిస్థితికి చలించిపోయారు. ఇక్బాల్ ది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఎటువంటి ఫలితం లభించలేదు. ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక, అసలు ఆ జబ్బేంతో తెలియక ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ చొరవ తీసుకుని, ఇక్బాల్‌ను ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.

ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం అతడికి సోకిన వింత వ్యాధికి గల కారణాలను విశ్లేషించేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే, ఎక్కువ సమయం పాటు నీటిలోనే ఉండటం వల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Anant Ambani
Iqbal
Rare Disease
Reliance Foundation Hospital
West Bengal
Mumbai Medical Treatment

More Telugu News