వడ్డెర మహిళ దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న చంద్రబాబు

Chandrababu Naidu fulfills promise as Vaddera woman Dalavai Ramadevi appointed MLC
  • వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి ఖరారు
  • ఇచ్చిన మాట ప్రకారం రమాదేవికి ఈ అవకాశం కల్పించామన్న సీఎం చంద్రబాబు
  • స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
  • మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు
  • రాష్ట్రంలో కొత్తగా 28 జిల్లా ప్రజా పరిషత్తుల ఏర్పాటుకు నిర్ణయం
సామాజిక న్యాయం దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది. అత్యంత వెనుకబడిన వర్గంగా ఉన్న వడ్డెర సామాజిక వర్గానికి చెందిన సాధారణ కార్యకర్త దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇది కేవలం ఒక పదవి కాదని, వెనుకబడిన వర్గాల సాధికారత పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగా, అందులో ఒకటి అత్యంత వెనుకబడిన వడ్డెర కులానికి చెందిన మహిళకు కేటాయించడం ద్వారా ఇచ్చిన మాటకు కట్టుబడ్డామని చంద్రబాబు ఉద్ఘాటించారు.

రమాదేవి గురించి చంద్రబాబు సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఆ అమ్మాయి ఒక మామూలు కార్యకర్త, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయాం. కానీ, మొట్టమొదటిసారిగా వడ్డెర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆరోజే మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం, చదువుకున్న మహిళ అయిన రమాదేవిని ఈరోజు శాసనమండలికి తీసుకుంటున్నాం" అని వివరించారు. ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యతో పాటు, బీసీ వర్గానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని ఆయన తెలిపారు. ప్రాణాలు పోగొట్టుకున్నా సిద్ధాంతాన్ని వదులుకోని ఎందరో బీసీ కార్యకర్తల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ చారిత్రక నిర్ణయంతో పాటే, బీసీల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే మరికొన్ని కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదించినట్లు చంద్రబాబు వెల్లడించారు. బీసీల రాజకీయ ఎదుగుదలకు గొడ్డలిపెట్టుగా మారిన గత ప్రభుత్వ నిర్ణయాలను సరిదిద్దుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టపరమైన బలం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వల్ల దాదాపు 16,800 మంది బీసీలు నాయకత్వ అవకాశాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, పట్టణాల్లో సుస్థిర పాలన కోసం మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పరిపాలనా వికేంద్రీకరణను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్తుల స్థానంలో 28 జెడ్పీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయాలు బీసీలకు భిక్ష కాదని, భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
Advertisement
Dalavai Ramadevi
Chandrababu Naidu
Andhra Pradesh MLC Appointment
Vaddera Community
BC Reservations 34 Percent
Andhra Pradesh Cabinet Decisions

More Telugu News