విశాఖ విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆగిపోవడంతో చాలా మంది బాధ పడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu outlines future plans for Visakhapatnam airport usage
  • భోగాపురం విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం
  • ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్న రామ్మోహన్ నాయుడు
  • విశాఖ ఎయిర్ పోర్టును ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడి

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విమాన కార్యకలాపాలు నిలిపివేయడంతో ఎందరో బాధపడుతున్నారని, అయితే కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొంతమేర బాధ ఉండటం సహజమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు నుంచి భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ అధికారికంగా ప్రారంభమైనట్లు వెల్లడించారు.


భోగాపురం ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. జీఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి నిర్మించిన ఈ విమానాశ్రయ నిర్మాణం మన ప్రాంత చరిత్ర, సంస్కృతికి అద్దం పడుతోందని ప్రశంసించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టును భవిష్యత్తులో ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలనే దానిపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. వైజాగ్ నుంచి కనెక్టివిటీ కోసం రోడ్ల అభివృద్ధి పనులు సాగుతున్నాయని, బీచ్ కారిడార్ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.


ఒకప్పుడు ఉత్తరాంధ్రను వెనుకబడిన ప్రాంతంగా పిలిచేవారని, కానీ తమ ప్రభుత్వ హయాంలో విజయనగరం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందుతోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లాలో నిర్మించిన ఈ బృహత్తర విమానాశ్రయాన్ని చూస్తుంటే ప్రపంచమే మన దగ్గర ఉందనే అద్భుతమైన అనుభూతి కలుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో ఒక నూతన శకం, సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని స్పష్టం చేశారు.

Advertisement
Ram Mohan Naidu
Bhogapuram Airport
Visakhapatnam Airport
North Andhra development
GMR Bhogapuram International Airport
Civil Aviation India

More Telugu News