60 లక్షల ఇళ్ల సందర్శన.. ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కీలక మైలురాయి

Telugu Desam Party visits 60 lakh houses under Intintiki Telugu Desam program
  • ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం కీలక మైలురాయి
  • 21 రోజుల్లో 61.61 లక్షల ఇళ్లను సందర్శించిన శ్రేణులు
  • కూటమి రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరిస్తున్న నేతలు
  • స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం కీలక మైలురాయిని అధిగమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షలకు పైగా కుటుంబాలను సందర్శించాయి. కేవలం 21 రోజుల్లోనే మొత్తం 61.61 లక్షల ఇళ్లకు నేరుగా వెళ్లినట్లు టీడీపీ ఆదివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వివరించడంతో పాటు, స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 21వ రోజైన ఆదివారం ఒక్కరోజే పార్టీ నాయకులు, కార్యకర్తలు 2.60 లక్షల కుటుంబాలతో మమేకమయ్యారు. ప్రతి ఇంటి వద్ద ప్రభుత్వ పథకాల ద్వారా వివిధ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలను వివరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, పేదల సంక్షేమం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రజలకు తెలియజేస్తున్నారు. అదే సమయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను, స్థానిక సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పార్టీ తెలిపింది. 60 లక్షల ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మరింత వేగంగా, విస్తృతంగా కొనసాగిస్తామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
Advertisement
Telugu Desam Party
Intintiki Telugu Desam
Andhra Pradesh Welfare Schemes
TDP Public Outreach Milestone
AP Alliance Government
TDP 60 Lakh Houses Visit

More Telugu News