అది నేరమా?.. టీచర్ల సస్పెన్షన్‌పై వైఎస్ జగన్ ఫైర్!

YS Jagan Mohan Reddy slams AP government over teacher suspension
  • టెట్ నుంచి మినహాయింపు కోరిన ఐదుగురు టీచర్ల సస్పెన్షన్
  • చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
  • ఇది కక్ష సాధింపు చర్యేనని సోషల్ మీడియాలో విమర్శలు
  • సస్పెన్షన్లు ఎత్తివేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • టీచర్లకు న్యాయపరంగా అండగా ఉంటామని హామీ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు కోరుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసిన ఐదుగురు టీచర్లను సస్పెండ్ చేయడంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నేడు సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

"మొదటి రోజు వైఎస్సార్ కడప జిల్లా టీచర్ల సంఘం వారిని, రెండో రోజు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల టీచర్లను సస్పెండ్ చేశారు. ఆ ఐదుగురు ఉపాధ్యాయులను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు చేసిన నేరం ఏమిటి?" అని జగన్ సూటిగా ప్రశ్నించారు. సర్వీసులో చేరినప్పుడు లేని టెట్ నిబంధనను ఇప్పుడు అమలు చేయడంతో లక్ష మందికి పైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధన నుంచి మినహాయింపు కోరుతూ తమకు అండగా నిలిచిన ఎంపీల సహకారంతో కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం నేరమా? అని జగన్ నిలదీశారు.

తక్షణమే ఉపాధ్యాయుల సస్పెన్షన్లను రద్దు చేసి, వారికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ అన్యాయమైన సస్పెన్షన్లపై న్యాయపోరాటంలో టీచర్లకు వైసీపీ పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. "మీ రెడ్ బుక్ అరాచక పాలన ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా వదలడం లేదు. చంద్రబాబు గారూ.. నిజానికి మీరే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ టెట్ నిబంధనను తొలగించాలని కోరాలి కదా? ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు?" అని జగన్ విమర్శించారు.

"మీరు చేయాల్సిన పని చేయలేదు. సీనియర్ టీచర్ల సమస్యలను గాలికొదిలేశారు. మా పార్టీ ఎంపీల మద్దతుతో వారు తమ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, దానికి రాజకీయ రంగు పులిమి సస్పెండ్ చేశారు. మీరు చేయలేని పనిని వారు చేయడానికి ప్రయత్నించడమే వారి తప్పా? ఒక సమస్యను పరిష్కరించాల్సింది పోయి, దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం దారుణం. ఇంతగా ఎలా దిగజారిపోయారు?" అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు గాలికొదిలేశారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడో ఏడాది నడుస్తున్నా మధ్యంతర భృతి (ఐఆర్), పీఆర్సీ హామీలు నెరవేర్చలేదని, ఐదు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. "చంద్రబాబు గారూ.. అధికార అహంకారంతో మీరు వ్యవహరిస్తున్న తీరును, మీ నియంతృత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. చివరకు మీ నీడను చూసి కూడా మీరు సహించలేని స్థాయికి చేరుకున్నారు" అని జగన్ విమర్శించారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Teacher Suspension Andhra Pradesh
Chandrababu Naidu
AP TET Exemption
YSRCP Teachers Support
Andhra Pradesh Education News

More Telugu News