తమిళనాడులో దారి తప్పిన మమ్ముట్టి.. 10 కిలోమీటర్లు దారి చూపిన అభిమాని

Mammootty lost in Tamil Nadu fan guides him for 10 kilometers
  • తమిళనాడులో అర్ధరాత్రి దారి తెలియక మమ్ముట్టి ఇబ్బందులు
  • గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవడంతో గంటకు పైగా నిలిచిపోయిన వైనం
  • బైక్‌పై 10 కిలోమీటర్లు దారి చూపిన పాండియన్ అనే అభిమాని
  • అభిమానితో సెల్ఫీ దిగి కృతజ్ఞతలు తెలిపిన స్టార్ హీరో
  • సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్న నిర్మాత ఆంటో జోసెఫ్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి తమిళనాడులో ఒక ఊహించని అనుభవం ఎదురైంది. షూటింగ్ ముగించుకుని కేరళకు తిరిగి వెళుతున్న సమయంలో, అర్ధరాత్రి దారి తప్పిపోగా.. ఒక అభిమాని చేసిన సహాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అసలేం జరిగిందంటే?

కారైకుడిలో తన కొత్త సినిమా షూటింగ్ ముగించుకున్న మమ్ముట్టి, నిర్మాత ఆంటో జోసెఫ్, నటుడు రమేష్ పిషారోడి, జార్జ్, డ్రైవర్ ఉన్నితో కలిసి కారులో కేరళకు బయలుదేరారు. తెల్లవారుజామున తిరుపత్తూరు సమీపంలో వారు ప్రయాణిస్తున్న ప్రధాన రహదారిని మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గం కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడినా ఫలితం లేకపోయింది. సుమారు గంటకు పైగా వివిధ దారుల్లో ప్రయత్నించి విసిగిపోయిన వారు, చివరకు పట్టమంగళం వద్ద ఒక పెట్రోల్ బంకులో సహాయం కోసం ఆగారు.

అక్కడే ఉన్న పాండియన్ అనే యువకుడు కారులో ఉన్న మమ్ముట్టిని గుర్తుపట్టాడు. వెంటనే వారి వద్దకు వెళ్లి, సహాయం చేస్తానని చెప్పాడు. అనంతరం, తన బైక్‌పై దాదాపు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, మ్యాప్‌లో కూడా స్పష్టంగా లేని చిన్న రోడ్లు, సందుల గుండా వారిని ప్రధాన రహదారిపైకి చేర్చాడు. దారి పొడవునా మమ్ముట్టి, పాండియన్‌ను "మన స్నేహితుడు" అని పిలుస్తూ, సరదాగా పాటలు పాడుతూ కనిపించారు.

అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్

గమ్యం చేరాక, నటుడు రమేశ్ పిషారోడి సరదాగా, "నువ్వు మమ్ముట్టికి దారి చూపానని చెబితే ఎవరూ నమ్మరు" అని పాండియన్‌తో అన్నారు. ఇది విన్న మమ్ముట్టి వెంటనే కారు దిగారు. పాండియన్ ఫోన్ తీసుకుని, తమ ఇద్దరినీ కలిపి ఒక ఫోటో తీయమని పిషారోడికి చెప్పారు. అనంతరం పాండియన్‌ను ఆలింగనం చేసుకుని, అతని పేరు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను, వివరాలను నిర్మాత ఆంటో జోసెఫ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మమ్ముట్టి కంపెనీ నిర్మాణంలో, నితీష్ సహదేవన్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
Advertisement
Mammootty
Tamil Nadu
Mammootty fan help
Ramesh Pisharody
Anto Joseph
Malayalam Megastar

More Telugu News