భోగాపురం విమానాశ్రయంలో బాధ్యతలు స్వీకరించిన సీఐఎస్ఎఫ్
- భోగాపురం విమానాశ్రయం భద్రతలో కీలక ఘట్టం
- రికార్డు సమయంలో విమానాశ్రయం పూర్తి కావడం పట్ల అభినందనలు తెలిపిన సీఐఎస్ఎఫ్ డీజీ
- అత్యున్నత స్థాయి భద్రతను, స్నేహపూర్వకమైన సేవలను అందిస్తామని వెల్లడి
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా వ్యవస్థలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్ ) అధికారికంగా తమ భద్రతా బాధ్యతలను స్వీకరించింది. ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐఎస్ఎఫ్ డీజీ ప్రవీణ్ రంజన్ మాట్లాడుతూ, కేవలం 31 నెలల రికార్డు సమయంలో ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు అత్యున్నత స్థాయి భద్రతతో పాటు స్నేహపూర్వకమైన సేవలు అందించేందుకు సీఐఎస్ఎఫ్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మీడియా మిత్రుల నుంచి నిరంతర సహకారం, పూర్తి మద్దతును ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.