జైల్లో ప్రజ్వల్ రాజభోగానికి చెక్.. సాధారణ ఖైదీలతో పాటు బ్యారక్‌కు తరలింపు

Prajwal Revanna VIP facilities checked in jail and shifted to barracks with general prisoners
  • రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ 
  • సెల్‌లో మొబైల్ ఫోన్ వాడినట్లు వీడియో వైరల్  
  • హోంమంత్రి ఆదేశాలతో సీసీబీ దాడుల్లో ఫోన్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
  • జైలు అధికారి సస్పెన్షన్, సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు
  • ఇకపై 20 మంది ఖైదీలతో పాటు సాధారణ బ్యారక్‌లో ప్రజ్వల్
అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో షాక్ తగిలింది. ఆయన ఉంటున్న వీఐపీ సెల్‌లో మొబైల్ ఫోన్ లభించడంతో, జైలు అధికారులు ఆయనను ఇతర ఖైదీలు ఉండే సాధారణ బ్యారక్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం సాయంత్రం 17 సెకన్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తీవ్రరూపం దాల్చింది.

ఆ వీడియోలో ప్రజ్వల్ జైలు నిబంధనలకు విరుద్ధంగా రంగు దుస్తులు ధరించి, ఫ్యాన్ ఉన్న గదిలో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు కనిపించింది. రెండు రోజుల క్రితం తాను కాల్ చేసినట్లు అందులో ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఈ వీడియో వెలుగులోకి రావడంతో జైలులో ఆయనకు అందుతున్న సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇటీవల కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు పరప్పన అగ్రహార జైలులో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రజ్వల్ సెల్ నుంచి ఒక మొబైల్ ఫోన్, ఛార్జర్, పెన్‌డ్రైవ్‌తో పాటు ఓ నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్, పెన్‌డ్రైవ్‌లో అశ్లీల వీడియోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తాను రెండు వారాల క్రితం జైలును సందర్శించినప్పుడు కొన్ని లోపాలను గమనించానని, ముఖ్యమంత్రి అనుమతితోనే సీసీబీ దాడులకు ఆదేశాలిచ్చానని హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే స్వయంగా వెల్లడించారు. దాడుల్లో ప్రజ్వల్ బ్యారక్‌ సహా మొత్తం 10కి పైగా మొబైల్ ఫోన్లు దొరికాయని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ స్పందిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్నను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జైలు సూపరింటెండెంట్ అన్షుకుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ప్రజ్వల్ సెల్‌లో దొరికిన ఫోన్‌లో పలు ఓటీటీ యాప్‌లు ఉన్నాయని, జైలు వై-ఫై నెట్‌వర్క్‌ను వాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజ్వల్‌ను సుమారు 20 మంది ఖైదీలు ఉండే సాధారణ బ్యారక్‌కు తరలించారు. అందరితో పాటు ఆయన కూడా జైలు యూనిఫాం ధరించి, గ్రంథాలయంలో కేటాయించిన పనులు చేయాలని ఆదేశించారు.
Advertisement
Prajwal Revanna
Parappana Agrahara Jail
Bengaluru Central Prison
Karnataka CCB Raid
Mobile Phone In Jail
VIP Cell Facilities

More Telugu News