తీవ్రమైన అపరిశుభ్రత.. బెంగళూరులోని 'జెప్టో' వేర్‌హౌస్‌కు సీల్ వేసిన అధికారులు
- జెప్టో వేర్‌హౌస్‌పై ఆకస్మికంగా దాడి చేసిన అధికారులు
- ఆహార ఉత్పత్తులు ఉంచే ప్రదేశంలో తీవ్ర అపరిశుభ్రత
- వేర్‌హౌస్‌ను సీజ్ చేసి, నోటీసులు జారీ చేసిన అధికారులు
ప్రముఖ క్విక్-కామర్స్ డెలివరీ సంస్థ ‘జెప్టో’కి సంబంధించి బెంగళూరులోని వేర్‌హౌస్‌పై అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోటే తాలూకాలోని జెప్టో గోదాములో ఆహార ఉత్పత్తులు ఉంచే ప్రదేశమంతా తీవ్ర అపరిశుభ్రంగా ఉండటం, నేలపై చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పడి ఉండటంతో ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను హ్యాండిల్ చేయడం, లేబులింగ్‌లో అక్రమాలు, కనీస పరిశుభ్రత లేకపోవడాన్ని గురించిన అధికారులు... తక్షణమే ఆ వేర్‌హౌస్‌ను సీల్ చేసి, సదరు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ఆహార భద్రత ప్రమాణాల చట్టం నిబంధనలను బొత్తిగా ఖాతరు చేయకపోవడంతో ఈ సెంటర్‌పై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సిఫార్సు చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఏ సంస్థనైనా ఉపేక్షించేది లేదని, ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ ఘటనపై జెప్టో యాజమాన్యం స్పందిస్తూ... అధికారులు గుర్తించిన లోపాలను సవరించుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేస్తామని వివరణ ఇచ్చింది. బెంగళూరు వ్యాప్తంగా ఇటీవల బ్లింకిట్, ఇతర హోటళ్లలోనూ ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం వెలుగుచూడటంతో అధికారులు విరుచుకుపడుతున్నారు.