నౌకల రీసైక్లింగ్‌లో భారత్‌ నంబర్‌ వన్‌.. 2025లో 35.4 శాతం వాటా

India becomes number one in ship recycling with 354 percent share in 2025
  • రీసైక్లింగ్‌ పరిమాణం 2.99 మిలియన్‌ గ్రాస్‌ టన్నులు
  • అలంగ్‌లోనే 98 శాతం దేశీయ రీసైక్లింగ్‌
  • అలంగ్‌ వార్షిక సామర్థ్యం 6 మిలియన్‌ గ్రాస్‌ టన్నులు
  • సామర్థ్యాన్ని 9 మిలియన్‌ ఎల్‌డీటీలకు పెంచే లక్ష్యం
  • ఎంఐవీ 2030 లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే సాధించిన భారత్‌
నౌకల రీసైక్లింగ్‌లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరింది. 2025లో ప్రపంచ నౌకల రీసైక్లింగ్‌లో భారత్‌ వాటా 35.4 శాతానికి పెరిగింది. 2024లో ఇది 30.1 శాతంగా ఉంది. దీంతో మారిటైమ్‌ రంగంలో భారత్‌ కీలక మైలురాయిని అందుకుంది.

2025లో భారత్‌లో 2.99 మిలియన్‌ గ్రాస్‌ టన్నుల నౌకలను రీసైకిల్‌ చేశారు. 2024లో ఈ పరిమాణం 1.86 మిలియన్‌ గ్రాస్‌ టన్నులుగా ఉంది. ఏడాదిలో దాదాపు 60 శాతం వృద్ధి నమోదైంది.

గుజరాత్‌లోని అలంగ్‌-సోసియా షిప్‌ రీసైక్లింగ్‌ క్లస్టర్‌ దేశ రీసైక్లింగ్‌ సామర్థ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్‌ రీసైక్లింగ్‌ హబ్‌గా గుర్తింపు పొందింది. దేశంలో జరుగుతున్న మొత్తం షిప్‌ రీసైక్లింగ్‌లో దాదాపు 98 శాతం ఇక్కడే జరుగుతోంది. ఈ క్లస్టర్‌ వార్షికంగా సుమారు 6 మిలియన్‌ గ్రాస్‌ టన్నుల రీసైక్లింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

అలంగ్‌లో ఏటా సుమారు 3.50 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం సహజ వనరులను వినియోగించాల్సిన అవసరం ఉండదు. అధీకృత రీసైక్లింగ్‌ యార్డులు, స్టీల్‌ రీ-రోలింగ్‌ మిల్లులు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు దీనికి తోడ్పడుతున్నాయి.

రీసైక్లింగ్‌ సామర్థ్యాన్ని దాదాపు 9 మిలియన్‌ లైట్‌ డిస్‌ప్లేస్‌మెంట్‌ టన్నులకు పెంచాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అలంగ్‌ షిప్‌ రీసైక్లింగ్‌ యార్డును మరింత అభివృద్ధి చేయనుంది. అలంగ్‌లోని శిక్షణా సంస్థ ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా కార్మికులకు భద్రత, ప్రమాదకర పదార్థాల నిర్వహణ, అత్యవసర పరిస్థితులపై శిక్షణ ఇచ్చింది.

మారిటైమ్‌ ఇండియా విజన్‌ 2030లో నిర్దేశించిన ప్రపంచంలోనే అగ్ర షిప్‌ రీసైక్లింగ్‌ దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని భారత్‌ ఐదేళ్ల ముందుగానే సాధించిందని అధికారిక ప్రకటన తెలిపింది.
Advertisement
India
Ship Recycling
Alang Gujarat
Maritime India Vision 2030
Global Ship Recycling Share
Steel Production

More Telugu News