సుంకాల పెంపు ఎఫెక్ట్.. బంగారంపై ప్రభుత్వానికి రూ.10,000 కోట్లకు పైగా ఆదాయం

Gold Import Duty Hike Effect Government Earns Over 10000 Crore Revenue
  • బంగారం, వెండిపై పెంచిన సుంకంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం
  • మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య రూ.10,463 కోట్ల సుంకం వసూలు
  • బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15కి పెంపు
  • విదేశీ మారక నిల్వలను కాపాడేందుకే ఈ నిర్ణయమన్న కేంద్రం
బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని సవరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య కాలంలో ఈ లోహాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ రూపంలో రూ.10,463 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు నివేదించింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మొత్తం వసూళ్లలో ఒక్క బంగారం నుంచే రూ.10,040 కోట్ల ఆదాయం లభించగా, వెండి ద్వారా రూ.328 కోట్లు, ప్లాటినం ద్వారా రూ.95 కోట్లు వసూలైనట్లు మంత్రి పేర్కొన్నారు. మే 13 నుంచి అమల్లోకి వచ్చేలా బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన సంగతి విదితమే. బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను సవరించడం ద్వారా ఈ పెంపును అమలు చేశారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు, ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో విలువైన లోహాల వంటి అప్రాధాన్య దిగుమతులను నియంత్రించి, విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముడిచమురు, ఎరువులు, పారిశ్రామిక ముడిసరుకులు వంటి అత్యవసర దిగుమతులకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

అయితే, దిగుమతి సుంకం పెరగడంతో పాటు బంగారం స్మగ్లింగ్ కార్యకలాపాలు కూడా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలో కస్టమ్స్ అధికారులు సుమారు 161 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, 116 మందిని అరెస్టు చేశారు.
Advertisement
Gold Import Duty
Central Government Revenue
Customs Duty Hike
Pankaj Chaudhary
Gold Smuggling India

More Telugu News