ఐటీఆర్‌ రిఫండ్‌ ఎప్పుడు వస్తుంది? ఆలస్యమైతే ఏం చేయాలి.. పూర్తి వివరాలివే

ITR Refund When will it arrive and what to do if delayed full details here
  • ఐటీఆర్‌ రిఫండ్‌కు లేని నిర్దిష్ట గడువు
  • సాధారణంగా రెండు నుంచి ఆరు వారాల సమయం
  • ఈ-వెరిఫికేషన్‌ వెంటనే పూర్తి చేయాలి
  • ఫామ్‌ 26ఏఎస్‌, ఏఐఎస్‌, టీఐఎస్‌ వివరాలు సరిపోలాలి
  • బ్యాంకు ఖాతా ప్రీ-వాలిడేట్‌ చేసి ఉండాలి
  • ఆలస్యమైతే ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో స్టేటస్‌ చూడాలి
ఆదాయపు పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌) దాఖలు చేశారా? అయితే రిఫండ్‌ ఎప్పుడు ఖాతాలో పడుతుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే రిఫండ్‌ జమ కావడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దిష్ట గడువు ఏదీ విధించలేదు. ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఐటీఆర్‌లో ఎలాంటి తప్పులు లేకుండా దాఖలు చేసి, వెంటనే ఈ-వెరిఫికేషన్‌ పూర్తి చేస్తే సాధారణంగా రెండు నుంచి ఆరు వారాల్లో రిఫండ్‌ అందే అవకాశం ఉంది.

రిఫండ్‌ త్వరగా రావాలంటే ఐటీఆర్‌లో ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఆదాయం, టీడీఎస్‌ వివరాలు ఫామ్‌ 26ఏఎస్‌, ఏఐఎస్‌, టీఐఎస్‌తో సరిపోలాలి. బ్యాంకు ఖాతాను ముందుగానే ప్రీ-వాలిడేట్‌ చేసి ఉండాలి. రిటర్న్‌ దాఖలు చేసిన వెంటనే ఈ-వెరిఫికేషన్‌ పూర్తి చేయడం కూడా కీలకమే. వివరాల్లో చిన్న తేడా ఉన్నా అదనపు పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో రిఫండ్‌ ఆలస్యం కావచ్చు.

ఐటీఆర్‌ను గడువు కంటే ముందే దాఖలు చేస్తే రిఫండ్‌ త్వరగా వస్తుందన్న హామీ ఏమీ ఉండదు. అయితే రిటర్న్‌ ప్రాసెసింగ్‌ క్యూలో ముందుగా చేరే అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పు తేలితే దాన్ని సరిచేసుకునేందుకు కూడా ఎక్కువ సమయం దొరుకుతుంది.

రిఫండ్‌ ఇంకా రాకపోతే ముందుగా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో రిటర్న్‌, రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేయాలి. బ్యాంకు ఖాతా ప్రీ-వాలిడేట్‌ అయిందో.. లేదో.. పరిశీలించాలి. ఆ ఖాతాకు పాన్‌ అనుసంధానం ఉందో కూడా చూడాలి. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏదైనా నోటీసు లేదా సమాచారం వచ్చిందా అనేది చెక్‌ చేసి, అవసరమైతే వెంటనే స్పందించాలి. అన్నీ సరిగ్గా ఉన్నా రిఫండ్‌ పెండింగ్‌లో ఉంటే అధికారిక పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

రిఫండ్‌ ఆలస్యమైన కొన్ని సందర్భాల్లో వడ్డీ కూడా లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 244ఏ కింద అర్హత ఉన్న రిఫండ్‌లకు వడ్డీ చెల్లించే నిబంధన ఉంది. నిబంధనలకు లోబడి సాధారణంగా నెలకు 0.5 శాతం చొప్పున సాధారణ వడ్డీ లభించే అవకాశం ఉంటుంది.
Advertisement
ITR Refund
Income Tax Return
ITR Refund Status
Income Tax Department
Tax Refund Delay
Section 244A Interest

More Telugu News