తమిళ గీతానికే తొలి ప్రాధాన్యం: కేంద్రం ఆదేశాలపై విజయ్ ప్రభుత్వం సంచలన తీర్మానం

C Joseph Vijay Government passes resolution prioritizing Tamil anthem over central orders
  • తమిళనాడులో అధికారిక కార్యక్రమాలపై కీలక తీర్మానం
  • ఇకపై మొదట రాష్ట్ర గీతం 'తమిళ తాయ్ వాళ్తు'నే ఆలపించాలి
  • అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన ప్రభుత్వం
  • తొలి స్థానం ఇవ్వడం తమ హక్కు అని స్పష్టం చేసిన సీఎం విజయ్
  • కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న తీర్మానం
తమిళనాడులోని అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఇకపై రాష్ట్ర గీతం 'తమిళ తాయ్ వాళ్తు'కే ప్రథమ ప్రాధాన్యం లభించనుంది. కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ సోమవారం తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

ముఖ్యమంత్రి విజయ్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ వాయిస్ ఓటు ద్వారా ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, తమిళ భాష తమ రాష్ట్రానికి ప్రాణనాడి, భావోద్వేగం, అస్తిత్వమని అభివర్ణించారు. "తమిళం మన గర్వం, తమిళం మన శక్తి. 'తమిళం' అన్న పదం యావత్ తమిళనాడును ఏకతాటిపైకి తెస్తుంది. తమిళ తాయ్ వాళ్తుకు రాష్ట్రంలో ప్రథమ స్థానం ఉండాలి, దానికి అగ్రపీఠం వేయడం మా హక్కు" అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, తమిళ భాషాభిమానం దేశభక్తి పరస్పర విరుద్ధం కావని ఆయన పేర్కొన్నారు.

అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతానికి ముందు జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక సూచన చేసింది. రాష్ట్ర గీతంతో పాటు జాతీయ గీతం లేదా గేయం ఆలపించాల్సి వస్తే, జాతీయ గేయానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సాంస్కృతిక మూలాలను పరిరక్షించేందుకు ఈ తీర్మానం చేశామని, ఇది రాజ్యాంగం కల్పించిన భాషా, సాంస్కృతిక హక్కులకు అనుగుణంగానే ఉందని ప్రభుత్వం వివరించింది. ఈ నూతన తీర్మానంతో, కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతం, ముగింపులో జాతీయ గీతం ఆలపించే సంప్రదాయం ఇకపై చట్టబద్ధంగా అమలుకానుంది.
Advertisement
C Joseph Vijay
Tamil Thai Vaalthu
Tamil Nadu Assembly Resolution
State Anthem Priority
Tamil Nadu Government

More Telugu News