పొలంలో రూ.5 లక్షలు పాతిపెట్టాడు.. ఏడాది తర్వాత బయటకు తీస్తే షాక్‌!

Rajasthan Farmer buried 5 lakh rupees in field shock after taking it out a year later
  • రాజస్థాన్‌లో పొలం అమ్మిన ఓ రైతు
  • వచ్చిన డబ్బును దొంగల భయంతో పొలంలో పాతిపెట్టిన వైనం
  • తర్వాత మర్చిపోయిన రైతు
  • సాగు పనుల్లో బయటపడిన పాలిథీన్‌ సంచి
  • చెదలు కొరకడంతో ముక్కలైన నోట్లు
  • పూర్తిగా పాడవడంతో స్వీకరించని ఎస్‌బీఐ శాఖ
దొంగల భయంతో ఇంట్లో డబ్బు ఉంచలేక పొలంలో పాతిపెట్టాడు ఓ రైతు. ఇల్లు కట్టుకోవడానికి దాచిన రూ.5 లక్షలు ఏడాది తర్వాత అనూహ్యంగా బయటపడ్డాయి. అయితే అప్పటికే చెదలు పట్టడంతో అవి ముక్కలుగా మారిపోయాయి. బ్యాంకుకు తీసుకెళ్లినా డబ్బు మార్చుకోలేకపోయాడు.

రాజస్థాన్‌కు చెందిన ఈ రైతు ఏడాది క్రితం ఓ స్థలాన్ని విక్రయించాడు. దాంతో రూ.5 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నాడు. నగదు ఇంట్లో ఉంటే చోరీకి గురయ్యే అవకాశం ఉందని భావించాడు. అవి ఖర్చు కాకూడదని కూడా నిర్ణయించుకున్నాడు. దీంతో డబ్బును పాలిథీన్‌ సంచిలో పెట్టి పొలంలో గుంత తీసి పాతిపెట్టాడు.

కొంతకాలానికి డబ్బు ఎక్కడ దాచాడో రైతు మర్చిపోయాడు. మద్యం తాగే అలవాటు, మతిమరుపు కారణంగా ఆ ప్రదేశాన్ని గుర్తించలేకపోయాడు. పలుసార్లు పొలంలో వెతికినా డబ్బు దొరకలేదు. చివరకు భార్య, కుమారులకు విషయం చెప్పాడు. మొదట వారు నమ్మలేదు. తర్వాత పొలంలో పలుచోట్ల తవ్వి చూశారు. అయినా ఫలితం లేకపోయింది.

ఇటీవల వర్షాకాలం సాగు పనుల కోసం పొలాన్ని సిద్ధం చేస్తుండగా పాలిథీన్‌ సంచి మట్టిలో నుంచి బయటకు వచ్చింది. కంచెను బాగుచేస్తున్న రైతు భార్య, కుమారుడు ఆ సంచిని గుర్తించారు.

తెరిచి చూడగా అందులో నగదు కనిపించింది. కానీ నోట్లు మొత్తం చెదలు కొరికేయడంతో చిరిగిపోయి ముక్కలుగా మారాయి. మిగిలిన డబ్బును మార్చుకోవచ్చేమోనని కుటుంబం పట్టణంలోని ఎస్‌బీఐ శాఖకు వెళ్లింది. నోట్ల పరిస్థితి దారుణంగా ఉండటంతో బ్యాంకు సిబ్బంది వాటిని తీసుకోలేదు. దీంతో జిల్లా ప్రధాన ఎస్‌బీఐ శాఖను ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.
Advertisement
Rajasthan Farmer
Currency Notes
Termite Damage
SBI Bank
Five Lakh Rupees
Money Buried in Field

More Telugu News