డీలిమిటేషన్‌పై డీఎంకే క్లారిటీ.. యూటర్న్ లేదన్న ఉదయనిధి

DMK clarity on Delimitation Udhayanidhi Stalin says no U-turn
  • డీలిమిటేషన్‌ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామన్న డీఎంకే
  • 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపునకు బిల్లులో ప్రతిపాదన
  • దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న తమిళనాడు
  • 1971 జనాభా లెక్కలనే కొనసాగించాలని డీఎంకే డిమాండ్
  • డీలిమిటేషన్‌పై ఎంపీలతో సమావేశం కానున్న సీఎం విజయ్
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తీసుకురానున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో తమిళనాడులో ఈ అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్లుపై డీఎంకే తన వైఖరిని మార్చుకుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. డీలిమిటేషన్‌ను మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నామని, భవిష్యత్తులో కూడా అదే వైఖరిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేసి, మొత్తం స్థానాలను 543 నుంచి 850కు పెంచాలని డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదిస్తోంది. దీన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లను పెంచితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, తమకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని తమిళనాడు వాదిస్తోంది.

కొన్ని మార్పులు చేస్తే బిల్లుకు మద్దతు ఇచ్చే అంశాన్ని డీఎంకే పరిశీలిస్తోందని వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఉదయనిధి వాటిని ఖండిస్తూ, డీఎంకే వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. 1971 జనాభా లెక్కలనే మరో 25 ఏళ్ల పాటు ప్రాతిపదికగా కొనసాగించాలని డీఎంకే డిమాండ్‌ చేస్తోంది.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో శనివారం సమావేశం కానున్నారు. డీలిమిటేషన్ వల్ల రాష్ట్రంపై పడే ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ బిల్లు ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యం కాదని కేంద్రానికి స్పష్టం చేశారు.
Advertisement
Udhayanidhi Stalin
DMK
Delimitation Bill
Tamil Nadu Politics
Lok Sabha Seat Redistribution
2011 Census

More Telugu News