గంటల పాటు హెల్మెట్ పెట్టుకుంటే చాలు.. వేలల్లో చెల్లిస్తున్న కంపెనీ

Conduit AI startup pays volunteers for brain to text research
  • ఆలోచనలను టెక్స్ట్‌గా మార్చే టెక్నాలజీపై పరిశోధన
  • పాల్గొన్న వారికి సెషన్‌కు రూ.5,200 చెల్లిస్తున్న ఏఐ స్టార్టప్
  • శస్త్రచికిత్స లేకుండా నాన్-ఇన్వాసివ్ పద్ధతిలో డేటా సేకరణ
  • ఈ ప్రాజెక్ట్‌లో చేరిన ఓపెన్ఏఐ మాజీ పరిశోధకురాలు నయోమి బష్కాన్స్కీ
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 'కండ్యూట్' (Conduit) అనే ఏఐ స్టార్టప్ సరికొత్త టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. మానవ ఆలోచనలను నేరుగా టెక్స్ట్‌గా మార్చే వ్యవస్థను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ పరిశోధనలో పాల్గొనే వలంటీర్లకు రెండు గంటల సెషన్‌కు 55 డాలర్లు  (దాదాపు రూ. 5,237) చెల్లిస్తోంది.

ఈ పరిశోధనలో పాల్గొనే వారు ఎలక్ట్రోడ్‌లు అమర్చిన ఒక ప్రత్యేకమైన హెల్మెట్‌ను ధరించాల్సి ఉంటుంది. రెండు గంటల పాటు జరిగే ఈ సెషన్‌లో వారు ఏఐ సిస్టమ్‌లతో మాట్లాడుతూ లేదా టైప్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారి మెదడు నుంచి వెలువడే నాడీ సంబంధిత సంకేతాలను రికార్డ్ చేస్తారు. అయితే, ఈ పరిశోధనలో పాల్గొనే వారికి వేళ్ల వైపు చూడకుండా టైప్ చేయగల నైపుణ్యం ఉండటం తప్పనిసరి.

శస్త్రచికిత్స అవసరం లేకుండా, నాడీ సంకేతాల ఆధారంగా ఈ టెక్నాలజీని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనిని 'టెలిపతీ ఎట్ స్కేల్' (telepathy at scale) గా అభివర్ణించింది. ఇటీవల ఓపెన్ఏఐ మాజీ పరిశోధకురాలు నయోమి బష్కాన్స్కీ కూడా ఈ స్టార్టప్‌లో వ్యవస్థాపక పరిశోధకురాలిగా చేరారు. మెదడు సంకేతాలను టెక్స్ట్‌గా మార్చే ప్రయోగాల్లో మెటా వంటి సంస్థలు కూడా నిమగ్నమైన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తమ ఫెసిలిటీలో వలంటీర్లకు డబ్బు చెల్లించి, న్యూరో-లాంగ్వేజ్ డేటాసెట్‌ను మరింత విస్తరించే పనిలో కండ్యూట్ నిమగ్నమై ఉంది. పెద్ద మొత్తంలో న్యూరల్ డేటాను, లాంగ్వేజ్ మోడళ్లను ఉపయోగించి ప్యాటర్న్‌లను గుర్తించడం ద్వారా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది.
Advertisement
Conduit
AI startup
Brain to text technology
Telepathy at scale
Naomi Bashkansky
Neuro language dataset

More Telugu News