నేత కార్మికులకు అండగా నిలుద్దాం: పవన్ కల్యాణ్
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
- నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్
- నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని నేత కార్మికులు, కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు గొప్ప నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నైపుణ్యం కలిగిన చేతులకు గౌరవం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చేనేత వస్త్రం మన సంస్కృతికి, చేతిపనితనానికి, స్వావలంబన స్ఫూర్తికి ప్రతిరూపమని పేర్కొన్న ఆయన, చేనేతను ఎంచుకోవడం ద్వారా మన సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయవచ్చని చెప్పారు. చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం తనకు గర్వకారణమని వెల్లడించారు.
చేనేత రంగానికి సాధికారత కల్పించేందుకు జనసేన పార్టీలో ప్రత్యేకంగా ‘నేత కార్మికుల అభివృద్ధి విభాగం’ ఏర్పాటు చేసినట్లు పవన్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఉచిత విద్యుత్ తో పాటు రూ.25,000 ఆర్థిక సాయం అందించే ‘నేతన్న సేవలో’ పథకం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రస్తావిస్తూ.. యువత, కంటెంట్ క్రియేటర్లు చేనేత దుస్తులు ధరించి వీడియోలతో ప్రచారం కల్పించాలని, ప్రతి భారతీయుడు చేనేతను దైనందిన జీవితంలో భాగం చేసుకుని నేతన్నలకు అండగా నిలవాలని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు.