అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
- కేంద్ర మంత్రి పెమ్మసానిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
- పిల్లి మాణిక్యరావు ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు
- ఇప్పటికే ఇదే అంశంపై కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పోలీస్ కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలను పోస్ట్ చేశారన్న ఆరోపణలతో పోలీసులు అంబటిపై BNS సెక్షన్లు 356, 353, 352, 61(2), 3(5) కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఇదే అంశంపై ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ (CID) కార్యాలయంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. వరుసగా సీఐడీతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసుల పరంపర కొనసాగుతుండటంతో.. ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు వ్యవహారం ఉత్కంఠను రేపుతోంది.