చెత్తలో పడేసిన రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరకు ఏమైందంటే!

Italy woman recovers 11 crore lottery ticket thrown in trash
  • రూ.11 కోట్ల టికెట్ చెత్తబుట్టలో
  • బహుమతి రాలేదని భావించిన మహిళ
  • చెత్త వాహనాన్ని గుర్తించిన అధికారులు
  • రోజంతా వెతికిన పారిశుద్ధ్య సిబ్బంది
  • చిరగకుండా దొరికిన లాటరీ టికెట్
  • ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న విజేత
అదృష్టం వస్తే ఎవరూ ఆపలేరు అంటారు. ఇటలీలో ఓ మహిళ విషయంలో అదే నిజమైంది. రూ.11 కోట్ల లాటరీ టికెట్‌ను పనికిరాదనుకుని చెత్తబుట్టలో పడేసింది. అంతటితో అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. చివరకు పారిశుద్ధ్య కార్మికుల శ్రమతో ఆమె అదృష్టం మళ్లీ చేతికొచ్చింది.

ఇటలీలోని బిటోంటో పట్టణానికి చెందిన ఓ మహిళ ఎప్పటిలాగే లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఫలితాలు తెలుసుకునేందుకు దుకాణానికి వెళ్లగా యంత్రంలో ‘నాన్ పేయబుల్’ అనే సందేశం కనిపించింది. బహుమతి రాలేదని భావించిన ఆమె టికెట్‌ను అక్కడే చెత్తబుట్టలో వేసి ఇంటికి వెళ్లిపోయింది.

కొద్దిసేపటికే కుటుంబ సభ్యులు అసలు విషయం చెప్పారు. ఆమె ఎంచుకున్న నంబర్లకే మొదటి బహుమతి వచ్చినట్లు తెలిపారు. భారీ నగదు బహుమతి గెలిచినప్పుడు దుకాణంలో డబ్బు ఇవ్వలేమనే అర్థంలోనే ‘నాన్ పేయబుల్’ సందేశం వస్తుందని అప్పుడే ఆమెకు తెలిసింది.

వెంటనే దుకాణానికి వెళ్లినా అప్పటికే చెత్తను తీసుకెళ్లే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వ్యర్థాల నిర్వహణ సంస్థ ఎస్‌ఏఎన్‌బీ అధికారులను సంప్రదించారు. వారు ఏ వాహనం చెత్తను తీసుకెళ్లిందో గుర్తించి ప్రత్యేక కేంద్రానికి తరలించారు.

ప్రమాదకర వ్యర్థాల మధ్య పారిశుద్ధ్య కార్మికులు రోజంతా చెత్తను జల్లెడ పట్టారు. ఎన్నో కాగితాలు, టికెట్లు వెతికిన తర్వాత చివరకు ఆ లాటరీ టికెట్ దొరికింది. అదీ చిరగకుండా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

టికెట్ దొరికిందని ఫోన్‌లో చెప్పగానే ఆ మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వెతకడం కోసం అయిన అదనపు ఖర్చును తానే భరిస్తానని ఆమె అంగీకార పత్రంపై సంతకం చేసింది. అయినా రూ.11 కోట్ల బహుమతి ముందు ఆ ఖర్చు చాలా చిన్నదేనని స్థానికులు అంటున్నారు.
Advertisement
Italy woman lottery winner
11 crore lottery ticket
Bitonto Italy
SANB waste management
Trash lottery ticket recovery
Non payable lottery message

More Telugu News