ఎన్నికలకు సిద్ధంకండి.. ప్రతి ఇంటి వద్ద కనీసం 3 నిమిషాలు ఉండండి: మంత్రులకు నారా లోకేశ్ సూచన
- స్థానిక ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయన్న నారా లోకేశ్
- భారీ విజయం లక్ష్యంతో క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచన
- ఎల్-నినో పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్న లోకేశ్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై తన సహచర మంత్రులకు నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు. స్థానిక పోరు అనుకున్న సమయానికే జరుగుతుందని స్పష్టం చేసిన లోకేశ్, కూటమి అభ్యర్థుల భారీ విజయానికి పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయికి వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా నాయకులు ప్రతి ఇంటి వద్ద కనీసం 3 నిమిషాలైనా గడిపి, వైసీపీ ప్రభుత్వ విధ్వంసాన్ని, కూటమి ప్రభుత్వం తెచ్చిన సంక్షేమాన్ని క్షుణ్ణంగా వివరించాలని స్పష్టం చేశారు. ఈ ఉదయం మంత్రులతో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు సూచించారు.
ఇదే సమావేశంలో అసెంబ్లీ వ్యూహంపైనా చర్చించారు. రాష్ట్రంలో ఉన్న ఎల్-నినో పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సూచించారు. జలాశయాల్లోకి నీరు చేరుతుండటం కొంత ఊరటనిచ్చినప్పటికీ... ప్రభుత్వం వైపు నుంచి తొలి ప్రాధాన్యత తాగునీటి సరఫరాకే ఇవ్వాలని, ఆ తర్వాత పశుగ్రాస కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభను సరైన వేదికగా మలుచుకోవాలని మంత్రులకు పిలుపునిచ్చారు.