విజయవాడ సెంట్రల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మల్లాది విష్ణును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ శ్రేణుల నిరాహారదీక్ష
- టెంట్‌ను టీడీపీ శ్రేణులు తొలగించడంతో ఉద్రిక్తత
- మల్లాది విష్ణును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేపట్టిన నిరాహార దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షా వేదిక వద్ద నుంచి మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడంతో స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు టెంట్‌ను తొలగించడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి క్రమంగా చేయిదాటి ఉభయ పక్షాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. అనుమతి లేని దీక్ష చేపట్టారంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విష్ణు అరెస్ట్ తర్వాత కూడా క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో, రెండు వర్గాల నడుమ ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.