'100% స్వచ్ఛం' తీసేయాలన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ... స్పందించిన 'డాబర్'

Dabur India asked by FSSAI to remove 100 percent pure claims from labels
  • '100% స్వచ్ఛం' వంటి క్లెయిమ్స్ నిలిపివేయాలని డాబర్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశం
  • ఈ క్లెయిమ్స్ వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆక్షేపణ
  • తమ ఉత్పత్తులు నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేసిన డాబర్
  • ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్తర్వులతో 4 శాతానికి పైగా పడిపోయిన డాబర్ షేరు ధర
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియాకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గట్టి షాక్ ఇచ్చింది. తమ ఉత్పత్తులపై "100 శాతం సహజం", "100 శాతం స్వచ్ఛం", "100 శాతం ఆర్గానిక్" వంటి క్లెయిమ్స్‌లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్లెయిమ్స్‌లు అస్పష్టంగా ఉంటూ వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని ఆగస్టు 4న జారీ చేసిన ఉత్తర్వులలో ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.

డాబర్ హిమాలయన్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్, డాబర్ ఆర్గానిక్ హనీ ఉత్పత్తులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి లేకుండానే 'జైవిక్ భారత్' లోగోను ప్రదర్శించడం నిబంధనల ఉల్లంఘన అని అథారిటీ గుర్తించింది. అదేవిధంగా, డాబర్ హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్‌పై "100 శాతం స్వచ్ఛత" అనే క్లెయిమ్‌ వినియోగించడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఆయా ఉత్పత్తుల విక్రయాలను వెంటనే నిలిపివేసి, 15 రోజుల్లోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డాబర్‌ను ఆదేశించింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలపై డాబర్ స్పందించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సమర్పించిన సమాచారంలో తమ ఉత్పత్తుల లేబుల్స్ ప్రస్తుత చట్టపరమైన నిబంధనలకు, పరిశ్రమ పద్ధతులకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. తమ ఉత్పత్తుల స్వచ్ఛత, నాణ్యతకు తాము కట్టుబడి ఉన్నామని, వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఎలాంటి క్లెయిమ్స్ చేయలేదని డాబర్ స్పష్టం చేసింది. ఆహార భద్రతలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని, తదుపరి చర్యల కోసం న్యాయసలహా తీసుకుంటున్నామని వివరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మార్కెట్లో డాబర్ షేరు ధర 4.32 శాతం నష్టపోయి రూ.407.40 వద్ద ముగిసింది.
Advertisement
Dabur India
FSSAI
100 percent pure claim
Jaivik Bharat logo
Dabur organic honey
Food safety regulations

More Telugu News