ఇరాన్‌ను ఎలా ఒత్తిడికి గురిచేయాలి?.. కొత్త ఆలోచనలు కోరిన అమెరికా

USA CENTCOM asks analysts for innovative ways to pressure Iran
  • నిఘా విశ్లేషకులకు సెంట్‌కామ్ ఈ-మెయిల్
  • వినూత్న ఆలోచనలు పంపాలని సూచన
  • వైమానిక దాడులపై సందేహాలు
  • భూగర్భ కేంద్రాలపై దాడి క్లిష్టమని అంచనా
  • చర్చలకు ఇరాన్‌ను తీసుకురావడమే అమెరికా లక్ష్యం
ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచేందుకు వినూత్న మార్గాలను సూచించాలని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తమ నిఘా విశ్లేషకులను కోరినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుత వ్యూహాలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యాలు నెరవేరకపోవచ్చనే ఆందోళనతో ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది.

గత వారం సెంట్‌కామ్‌కు చెందిన ఓ సీనియర్ సైనిక అధికారి పెద్ద సంఖ్యలో నిఘా విశ్లేషకులకు ఈ-మెయిల్ పంపినట్లు సీఎన్‌ఎన్ వెల్లడించింది. ఇరాన్‌పై ఒత్తిడి పెంచే, కఠిన చర్యలకు దారి తీసే కొత్త ఆలోచనలు పంపాలని అందులో కోరినట్లు పేర్కొంది. సైనిక, దౌత్యపరమైన చర్యల పరిమితుల కారణంగా ఈ ప్రయత్నం జరిగినట్లు సమాచారం.

ఈ అంశంపై సెంట్‌కామ్ ప్రతినిధి కెప్టెన్ టిమోతి హాకిన్స్ స్పందించారు. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం తమ కమాండ్‌లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయమని చెప్పారు. అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తరచూ అన్ని స్థాయుల సిబ్బంది నుంచి సూచనలు కోరుతుంటారని వివరించారు.

ఇటీవల ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరిచే లక్ష్యంతో అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. అయినా వాటి వల్ల ఇరాన్ చర్చలకు వస్తుందనే నమ్మకం అమెరికా నిఘా సంస్థలకు లేదని సీఎన్‌ఎన్ పేర్కొంది. భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలను కేవలం వైమానిక దాడులతో ధ్వంసం చేయడం కష్టమని సైనిక వ్యూహకర్తలు భావిస్తున్నట్లు తెలిపింది.

పరిమిత స్థాయిలో దాడులు చేపట్టే అవకాశాన్ని కూడా అమెరికా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ క్షిపణి సామర్థ్యాలపై ఒకటి నుంచి రెండు వారాలపాటు విస్తృత దాడులకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే సామాన్య పౌరుల మరణాలు పెరిగే ప్రమాదం, వైమానిక రక్షణ వ్యవస్థల నిల్వలు తగ్గిపోతుండటంపై ఆందోళనలతో తుది నిర్ణయం వాయిదా పడినట్లు తెలిపింది.
Advertisement
USA
Iran
CENTCOM
Donald Trump
US Intelligence
Military Strategy

More Telugu News