Advertisement

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల ప్రభంజనం.. బాక్సింగ్‌లో 7 స్వర్ణాలు, అథ్లెటిక్స్‌లో గుల్వీర్ చరిత్ర

India medal rush at Commonwealth Games 7 Golds in Boxing and Gulveer history in Athletics
  • గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్ల ప్రభంజనం
  • మొత్తం 7 స్వర్ణాలు, 3 రజతాలతో సరికొత్త చరిత్ర
  • రజతం గెలిచి మేరీ కోమ్, విజేందర్ సరసన చేరిన లవ్లీనా
  • అథ్లెటిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ రికార్డు
  • 60 కేజీల విభాగంలో సచిన్, 80 కేజీల విభాగంలో అంకుశ్ స్వర్ణాలు కైవసం
గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల మోత మోగించింది. ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మరోవైపు, అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్ అరుదైన ఘనతను అందుకున్నాడు.

శనివారం జరిగిన ఫైనల్స్‌లో అంకుశ్ పంఘాల్ (80 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) సహా అరుంధతి, ప్రియ, సాక్షి, ప్రీతి, జైస్మిన్ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో భారత్ తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.

మహిళల 75 కేజీల విభాగం ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గొహెయిన్.. ఆస్ట్రేలియా బాక్సర్ ఎమ్మా-స్యూ గ్రీన్‌ట్రీ చేతిలో 1-4 తేడాతో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ, ఈ పతకంతో మేజర్ టోర్నమెంట్లన్నింటిలో పతకం సాధించిన మేరీ కోమ్, విజేందర్ సింగ్ సరసన లవ్లీనా చోటు దక్కించుకుంది. నరేందర్ (90+ కేజీలు), జడుమణి సింగ్ కూడా రజతాలు సాధించారు.

అథ్లెటిక్స్‌లో భారత స్టార్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రక ప్రదర్శన చేశాడు. పురుషుల 5000 మీటర్ల పరుగులో 13:24.95 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి కాంస్యం గెలుచుకున్నాడు. అంతకుముందు 10,000 మీటర్లలో రజతం సాధించిన గుల్వీర్, ఒకే కామన్వెల్త్ గేమ్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
Advertisement
India
Commonwealth Games 2026
Gulveer Singh
Indian Boxers
Glasgow 2026
Boxing Gold Medals

More Telugu News