మహళా ఎస్సైపై దౌర్జన్యం.. పరారీలో వైసీపీ నేత చింతాడ రవికుమార్
- జగన్ పర్యటన సందర్భంగా ఎస్సై ప్రవల్లికపై చింతాడ రవికుమార్ దౌర్జన్యం
- నిన్న ఉదయమే అజ్ఞాతంలోకి వెళ్లిన చింతాడ
- జనం తోపులాట నుంచి ఆమెను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశానన్న వైసీపీ నేత
వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న బూర్జ పోలీస్‌స్టేషన్ మహిళా ఎస్సై ప్రవల్లికపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనకు బాధ్యుడైన ఆమదాలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన శుక్రవారం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారైన ఆయన... తాజాగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఎస్సై ఆరోగ్యం బాగోలేకపోవడంతో జనం తోపులాట నుంచి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేశామని, అంతేకానీ ఎలాంటి దాడి చేయలేదని చింతాడ రవి ఆ వీడియోలో వివరణ ఇచ్చారు. అయితే తమపై మహిళపై దాడి, హత్యాయత్నం, అధికారి విధులకు భంగం కలిగించడం వంటి తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
చింతాడ రవికుమార్‌పై నమోదైన కేసు వివరాలను పోలీసులు నిన్న సాయంత్రం వరకు అధికారికంగా బయటపెట్టలేదు. కానీ, నిన్న ఉదయానికే ఆయన పరారయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ... పోలీస్ వెబ్‌సైట్‌లో ఎక్కడా కనిపించని కేసు వివరాలు రవికి ముందే ఎలా తెలిశాయని, ఎస్పీ ఆఫీసులోనే వైసీపీ కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనలో రవికుమార్‌తో పాటు మొత్తం 21 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో పాల్గొన్న ఏ2 బొడ్డేపల్లి శ్రీనుపై గతంలో పలాస వ్యాపారి కిడ్నాప్ కేసు ఉంటే.. ఏ4 అన్నెపు కృష్ణపై ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు ఉన్నాయని సమాచారం. మరికొందరిపై కూడా గతంలో కొట్లాటలు, ఆస్తుల ధ్వంసం కేసులు ఉన్నట్లు తేలింది.
మరోవైపు, దౌర్జన్యానికి గురైన ఎస్సై ప్రవల్లికను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నిన్న పోలీస్ స్టేషన్‌లో కలిసి పరామర్శించారు. జరిగిన ఉదంతాన్ని అడిగి తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై వైసీపీ శ్రేణులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.