Advertisement

వైసీపీ హయాంలో అర్హుల చేతిలో హాల్ టిక్కెట్లు మిగిలితే.. అనర్హుల చేతికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందాయి: ఏలూరి సాంబశివరావు

Yeluri Sambasiva Rao says eligible got hall tickets while ineligible got appointments under YSRCP
  • నిరుద్యోగంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్న ఎమ్మెల్యే ఏలూరి
  • జగన్ పాలనలో యువత భవిష్యత్తు నాశనమైందని విమర్శలు
  • గ్రూప్-1 పేపర్లను వంటవాళ్లతో దిద్దించారని ఆరోపణ 
  • కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపడుతోందని వెల్లడి
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అర్హులైన యువత చేతుల్లో కేవలం హాల్ టిక్కెట్లు మాత్రమే మిగిలాయని, అనర్హులు మాత్రం అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును నాశనం చేసిన వైసీపీ నాయకులకు వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ పాలనలో యువతకు కేవలం నిరాశ, అన్యాయమే మిగిలితే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు, ఉపాధితో భవిష్యత్తుపై భరోసా లభిస్తోందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ.. "వైసీపీ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిగా అవినీతిమయమైంది. అర్హత ఉన్నవారిని కాదని, తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరిచే వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి గ్రూప్-1 పరీక్షలు రాసిన అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారు. రోజువారీ కూలీలు, వంటవాళ్లు, ఆటో డ్రైవర్లతో గ్రూప్-1 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయించి యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన నీచ చరిత్ర జగన్‌ది" అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిష్ఠాత్మకమైన ఏపీపీఎస్సీని అవినీతి కేంద్రంగా మార్చారని, న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేశారని విమర్శించారు.

వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా, కమీషన్ల కోసం ఉన్న కంపెనీలను కూడా తరిమివేయడంతో 34 లక్షల మంది యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఏలూరి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం.. గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. జగన్ పాలనలో ఉద్యోగాలు లేక 4,100 మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.

ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనంతో పాలన సాగిస్తోందని ఏలూరి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందని చెప్పారు. 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు, తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో మరో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఇప్పటికే 7 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, యువత ఉజ్వల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.
Advertisement
Yeluri Sambasiva Rao
YSRCP Government
Andhra Pradesh Jobs
APPSC Group 1 Scam
Jagan Mohan Reddy
AP Unemployment Rate

More Telugu News