ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలి: రేణుకా చౌదరి
- నీట్ పేపర్ లీకేజీపై తీవ్ర స్థాయిలో విపక్షాల నిరసనలు
- బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న రేణుకా చౌదరి
- విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం దారుణమని వ్యాఖ్య
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ, విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపడంతో పార్లమెంట్ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్పందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి, పార్లమెంట్ నుంచి పంపించివేయాలని దేశప్రజలు డిమాండ్ చేస్తున్నారని, కానీ ఈ ప్రభుత్వం దేనినీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సభను నడపడం తెలియక తమను అడ్డుకోవడానికి ప్రతి అరగంటకు ఒకసారి సభను వాయిదా వేస్తున్నారని ఆరోపించిన ఆమె, ప్రజాస్వామ్యాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. నీట్ లీకేజీపై పోరాడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం దారుణమని, ఇందులో పోలీసులను కూడా ప్రభుత్వం బలిపశువులను చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. "మీ కాలం ముగిసింది, పర్యవసానాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.