ముంబైలో రూ.84 కోట్లతో విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేసిన జాన్ అబ్రహం

John Abraham buys luxury bungalow in Mumbai for 84 crore
  • బాంద్రా వెస్ట్ ప్రాంతంలో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిన జాన్ అబ్రహం
  • 1,017.60 చదరపు మీటర్ల ప్లాట్ విస్తీర్ణంలో ఉన్న ప్రాపర్టీ
  • బంగ్లా కొనుగోలు కోసం రూ. 5.04 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించిన స్టార్ హీరో

బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్ రంగంలో తన పెట్టుబడులను మరింత విస్తరించారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన, ప్రతిష్టాత్మకమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఆయన రూ.84 కోట్లతో ఒక లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ముంబై లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇటువంటి హెవీ డీల్స్ జోరుగా సాగుతున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


'లయాసెస్ ఫోరాస్' ద్వారా వెల్లడైన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ బంగ్లా బాంద్రా వెస్ట్‌లోని ప్రసిద్ధ సెయింట్ మార్టిన్ రోడ్‌లో ఉంది. సుమారు 1,017.60 చదరపు మీటర్ల ప్లాట్ విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీలో 193.12 చదరపు మీటర్ల ప్రధాన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక అవుట్‌హౌస్ కూడా ఉంది. ఈ లావాదేవీ జులై 14, 2026న అధికారికంగా రిజిస్టర్ కాగా, ఈ బంగ్లా కొనుగోలు కోసం జాన్ అబ్రహం ఏకంగా రూ.5.04 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. నౌషిర్ ఎరుచ్ దివిత్రే, ఫ్రీడన్ ఎరుచ్ దివిత్రే, క్రిస్టల్ ఫిరోజ్ దివిత్రే మరియు ఎరుచ్ ఫిరోజ్ దివిత్రే అనే వ్యక్తుల నుంచి రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్ ద్వారా ఆయన ఈ ఫ్రీహోల్డ్ ఆస్తిని సొంతం చేసుకున్నారు.


గతంలో కూడా జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు పెట్టారు. డిసెంబర్ 2023లో ముంబైలోని ఖార్ ప్రాంతంలో లింకింగ్ రోడ్డులో ఉన్న ఒక లగ్జరీ బంగ్లాను రూ.70.83 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా కొనుగోలు చేసిన రూ.84 కోట్ల బాంద్రా బంగ్లాతో ఆయన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోకు మరో ప్రైమ్ ప్రాపర్టీ తోడైంది. ఇక సినిమాల విషయానికొస్తే, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే బయోపిక్‌లో జాన్ అబ్రహం త్వరలోనే నటించనున్నారు.

Advertisement
John Abraham
Mumbai real estate
Bandra West bungalow
John Abraham property purchase
Bollywood celebrity luxury homes
Mumbai luxury property deals

More Telugu News