‘భగవంత్ కేసరి’కి రీమేకే, కానీ.. ‘జన నాయగన్‌’పై డైరెక్టర్ క్లారిటీ!

Thalapathy Vijay Jana Nayagan is Bhagavanth Kesari remake director H Vinoth clarifies
  • 50 శాతం సినిమాను ‘భగవంత్‌ కేసరి’ ఆధారంగా రూపొందించామన్న వినోద్‌
  • తొలి భాగం 60 శాతం, రెండో భాగంలో 20 శాతం ఒరిజినల్‌ కథను పోలి ఉంటాయని వివరణ
  • పోస్ట్‌ క్లైమాక్స్‌లో లోకేశ్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్‌లు కనిపిస్తారని వెల్లడి
  • ఆ సన్నివేశాలను విజయ్‌ స్వయంగా తెరకెక్కించారని వెల్లడి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమైంది. జులై 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై చాలా కాలంగా తెలుగు బ్లాక్‌బస్టర్ ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. తాజాగా దర్శకుడు హెచ్. వినోద్‌ తొలిసారిగా ఈ వార్తలపై స్పష్టత నిచ్చారు. సినిమా పూర్తిస్థాయి రీమేక్ కాదని, కేవలం 50 శాతం మాత్రమే ‘భగవంత్ కేసరి’ ఆధారంగా రూపొందించామని వెల్లడించారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వినోద్.. తొలి భాగంలో సుమారు 60 శాతం, రెండో భాగంలో 20 శాతం మాత్రమే ఒరిజినల్ కథకు పోలికలు ఉంటాయని చెప్పారు. మిగతా భాగాన్ని తమిళ ప్రేక్షకుల అభిరుచికి, విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కొత్తగా తీర్చిదిద్దినట్లు వివరించారు. అంతేకాదు, ‘భగవంత్ కేసరి’ని రీమేక్ చేయాలన్న ఆలోచన కూడా విజయ్‌దేనని తెలిపారు. మహిళా సాధికారత సందేశం ఉన్న కథ కావడంతో ఆయనకు బాగా నచ్చిందని, అందుకే ఈ సినిమాను ఎంపిక చేసుకున్నారని చెప్పారు.

మరో ఆసక్తికర విషయాన్ని కూడా వినోద్ బయటపెట్టారు. సినిమా కోసం పోస్ట్‌ క్లైమాక్స్‌లో లోకేశ్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్‌లతో ప్రత్యేక సన్నివేశాలను విజయ్ స్వయంగా తెరకెక్కించారని వెల్లడించారు. అయితే ఎన్నికల తర్వాత ఆ సన్నివేశాలు ఇప్పటికీ సినిమాలో ఉంటాయా? లేదా? అన్నది తాను చెప్పలేనని, తుది నిర్ణయం చిత్రబృందానిదేనని అన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. విడుదలకు ముందే 'జన నాయగన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement
Thalapathy Vijay
Jana Nayagan
H Vinoth
Bhagavanth Kesari Remake
Pooja Hegde
KVN Productions

More Telugu News