రాజస్థాన్‌లో వైన్ షాపులోకి చొరబడి చిరుత బీభత్సం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

Leopard enters wine shop in Rajasthan CCTV footage of the chaos
  • ఇద్దరు ఉద్యోగులు, ఫారెస్ట్ వాలంటీర్‌పై దాడి చేసి గాయపరిచిన చిరుత‌
  • చిరుతను షాపు లోపల బంధించి, అప్రమత్తమైన సిబ్బంది
  • మద్యం దుకాణం వద్ద భారీగా మోహరించిన పోలీసులు 
  • చిరుతను పట్టుకోవడానికి జైపూర్ నుంచి వ‌చ్చిన‌ ప్రత్యేక బృందం
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో నిన్న‌ ఉదయం తీవ్ర కలకలం రేగింది. జనావాసాల్లోకి చొరబడిన ఓ చిరుతపులి, ఏకంగా ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు షాపు ఉద్యోగులపై దాడి చేసి గాయపరిచింది. అప్రమత్తమైన సిబ్బంది చాకచక్యంగా చిరుతను షాపు లోపలే బంధించారు. ఈ సంఘటన తోడరాయ్‌సింగ్ పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నిన్న‌ ఉదయం ఓ సేల్స్‌మ్యాన్ మద్యం దుకాణం తెరిచారు. ఆయన లోపల క్యాష్ కౌంటర్ వద్ద డబ్బులు లెక్కిస్తుండగా, సమీపంలోని అడవి నుంచి దారి తప్పి వచ్చిన చిరుతపులి నిశ్శబ్దంగా షాపులోకి ప్రవేశించింది. ఆ సమయంలో సేల్స్‌మ్యాన్‌ గానీ, మరో సెక్షన్‌లో కూర్చున్న అతని సహోద్యోగి గానీ దీనిని గమనించలేదు. అకస్మాత్తుగా చిరుత సేల్స్‌మ్యాన్‌పై దాడి చేసి గాయపరిచింది. ఆ తర్వాత మరో ఉద్యోగిపై కూడా దాడికి పాల్పడింది. ఇద్దరూ ప్రాణభయంతో షాపు నుంచి బయటకు పరుగెత్తి, వెంటనే షట్టర్‌ను కిందికి దించి చిరుతను లోపల బంధించారు. ఈ దాడిలో గాయపడిన సేల్స్‌మ్యాన్‌ను తదుపరి చికిత్స నిమిత్తం టోంక్‌కు తరలించగా, మరో ఉద్యోగికి స్థానికంగా ప్రథమ చికిత్స అందించారు.

అంతకుముందు ఇదే చిరుతపులి అటవీ ప్రాంతంలోని అవుట్‌పోస్ట్ సమీపంలో రాకేష్ సైనీ అనే ఫారెస్ట్ వాలంటీర్‌పై కూడా దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అతని కాళ్లకు గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో చిరుతపులి నెమ్మదిగా షాపులోకి రావడం, లోపలికి వెళ్లే దారిలోనే ఓ వ్యక్తిపై దాడి చేయడం స్పష్టంగా రికార్డయింది. ఆ తర్వాత అది ఓ టేబుల్‌పైకి ఎక్కి, పరిస్థితిని గమనించడానికి వచ్చిన షాపు యజమానిపైకి అకస్మాత్తుగా దూకి, షాపు లోపలికి పరుగెత్తింది. మరో క్లిప్‌లో మద్యం బాటిళ్లు ఉన్న ర్యాక్ కింద నక్కినట్లు కనిపించింది.

చిరుతను షాపులో బంధించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అనురాగ్ మహర్షి, ఆయన బృందం టోంక్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతకు మత్తుమందు ఇచ్చి సురక్షితంగా పట్టుకోవడానికి జైపూర్ జూ నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపించారు. తోడరాయ్‌సింగ్, బిసాల్‌పూర్ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం నమోదవుతోందని అటవీ అధికారులు వెల్లడించారు. పట్టణ శివార్లలోని ఆలయాలు, కొండల వద్ద కూడా చిరుత కనిపించినట్లు గతంలో నివేదికలు వచ్చాయి. 
Advertisement
Leopard
Rajasthan Wine Shop
Tonk District News
Leopard Attack CCTV
Todaraisingh Leopard Incident
Wildlife Rescue Rajasthan

More Telugu News