డెంగీపై భారత్‌కు తొలి వ్యాక్సిన్‌.. ‘క్యూడెంగా’కు ఆమోదం!

Qdenga Takeda dengue vaccine gets approval for use in India
  • భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు ఆమోదం
  • నాలుగు రకాల డెంగీ వైరస్‌ల నుంచి రక్షణ
  • మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు
  • ప్రయోగాల్లో ఆస్పత్రి చేరికలను 84 శాతం తగ్గించిన వైనం
  • దేశీయ తయారీతో ధర తగ్గే అవకాశం
వర్షాకాలం మొదలైతే డెంగీ భయం వెంటాడటం మనకు కొత్త కాదు. ఏటా వేలాది మంది ఆసుపత్రుల పాలవుతుంటారు. అలాంటి డెంగీ నియంత్రణలో భారత్‌ కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌గా జపాన్‌కు చెందిన టకెడా కంపెనీ రూపొందించిన ‘క్యూడెంగా’కు ‘కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ఆమోదం తెలిపింది. దీంతో డెంగీ నివారణలో భారత్‌కు మరో కీలక ఆయుధం అందుబాటులోకి రానుంది.

భారత్‌లో గత రెండు దశాబ్దాలుగా డెంగీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పట్టణీకరణ, వాతావరణ మార్పులు, దోమల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు, జనాభా పెరుగుదల ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న డెంగీ కేసుల్లో దాదాపు మూడో వంతు భారత్‌లోనే ఉంటాయని అంచనా. ముఖ్యంగా వర్షాకాలం, ఆ తర్వాతి నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

క్యూడెంగా (టీఏకే-003)ను జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ టకెడా అభివృద్ధి చేసింది. ఇది లైవ్‌ అటెన్యుయేటెడ్‌ టెట్రావాలెంట్‌ వ్యాక్సిన్‌. అంటే డెంగీ వైరస్‌లోని నాలుగు రకాలైన డెన్‌వీ-1, డెన్‌వీ-2, డెన్‌వీ-3, డెన్‌వీ-4పై రోగనిరోధక శక్తిని పెంచేలా రూపొందించారు. ఈ వ్యాక్సిన్‌ను మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు. చర్మం కింద ఇంజెక్షన్‌ రూపంలో వేస్తారు. డెంగీ అధికంగా ఉన్న దేశాల్లో సమగ్ర నియంత్రణ వ్యూహంలో భాగంగా దీన్ని వినియోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే సూచించింది.

ఈ వ్యాక్సిన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. గతంలో అందుబాటులో ఉన్న డెంగ్‌వాక్సియా వ్యాక్సిన్‌ తీసుకునే ముందు వ్యక్తికి ఇప్పటికే డెంగీ సోకిందో లేదో రక్త పరీక్ష చేయాల్సి వచ్చేది. అలాంటి అవసరం క్యూడెంగాకు లేదు. డెంగీ వచ్చినా, రాకపోయినా ఈ వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చు. దీంతో సామూహిక టీకా కార్యక్రమాలను సులభంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌, బ్రెజిల్‌, ఇండోనేషియా, అర్జెంటీనా సహా 40కిపైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్‌ కూడా చేరింది.

క్యూడెంగా ప్రభావంపై నిర్వహించిన టైడ్స్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ అధ్యయనంలో 20 వేల మందికిపైగా పిల్లలు, యువత పాల్గొన్నారు. సుమారు నాలుగున్నరేళ్ల పరిశీలనలో ఆసుపత్రిలో చేరే పరిస్థితిని 84 శాతం వరకు తగ్గించినట్లు గుర్తించారు. ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారిత డెంగీ కేసులపై దాదాపు 61 శాతం రక్షణ కల్పించినట్లు వెల్లడైంది. గతంలో సోకిన వారికైనా, సోకని వారికైనా తీవ్రమైన డెంగీ ప్రమాదాన్ని తగ్గించడంలో మంచి ఫలితాలు కనిపించాయి. వైరస్‌ రకాన్ని బట్టి ప్రభావంలో కొంత తేడా ఉన్నప్పటికీ మొత్తం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ ధరను ఇంకా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్‌-ఈ’తో టకెడా ఇప్పటికే ఉత్పత్తి ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి ఐదు కోట్ల డోసులు తయారు చేసే సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయంగా తయారీ ప్రారంభమైతే ధరలు తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. మొదట ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తుందా, లేక ప్రభుత్వ టీకా కార్యక్రమంలో చేర్చుతారా అన్న విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Qdenga
Dengue Vaccine India
Takeda Pharmaceutical
CDSCO Approval
Biological E Hyderabad
Dengue Prevention

More Telugu News