ఎల్ నినోపై చంద్రబాబు సమగ్ర వ్యూహం: కలెక్టర్లకు కీలక ఆదేశాలు

ఎల్ నినోపై చంద్రబాబు సమగ్ర వ్యూహం: కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Comprehensive Strategy on El Nino Key Orders to Collectors
  • అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు
  • ఎల్ నినో ప్రభావంపై సమీక్ష
  • 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశం
  • తాగునీరు, పశుగ్రాసానికి కొరత రాకుండా చూడాలని సూచన
  • రైతులు, వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం
  • ఎల్ నినోపై ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తానన్న ముఖ్యమంత్రి
రాష్ట్రంపై 'సూపర్ ఎల్ నినో' ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై లోతుగా చర్చించి, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎల్ నినో విపత్తును ఒక సవాల్‌గా స్వీకరించి, రైతులు, వినియోగదారులపై దాని ప్రభావం పడకుండా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, మంత్రులు, అధికారులు, కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా నీటిపారుదల ప్రాజెక్టుల ప్రాముఖ్యతను చంద్రబాబు నొక్కి చెప్పారు. "ఈ సీజన్‌లో తీవ్రమైన ఎల్ నినో పరిస్థితుల్లోనూ పట్టిసీమ ద్వారా 39.5 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి లక్షల ఎకరాల పంటను కాపాడగలిగాం. ప్రస్తుతం పట్టిసీమ నుంచి 8,100 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, ప్రకాశం బ్యారేజీకి 6,700 క్యూసెక్కులు చేరుతోంది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని కరవు నుంచి శాశ్వతంగా గట్టెక్కించే 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలి" అని లక్ష్యం నిర్దేశించారు. 

వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా పనులను వేగవంతం చేసిన జలవనరుల శాఖ మంత్రిని, అధికారులను అభినందించారు. నిర్దేశిత గడువు కంటే ముందే పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు, అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు.

ఎల్ నినో ప్రభావం కేవలం వ్యవసాయంపైనే కాకుండా, ద్రవ్యోల్బణం రూపంలో సాధారణ ప్రజలపైనా ఉంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. "పంటలు సరిగా పండకపోతే నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీనిని అరికట్టేందుకు మంత్రుల కమిటీ నిరంతరం పనిచేయాలి. రైతు బజార్లను చైతన్యవంతం చేయాలి. భవిష్యత్తులో డిమాండ్ ఉండే ఉల్లి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వంటి పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి. అవసరమైతే రాయితీలపై విత్తనాలు అందించి, కనీస మద్దతు ధర ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలించాలి" అని సూచించారు.

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏయే పంటలకు బీమా ఉందో గుర్తించి, ఆ పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, పంట నష్టపోతే బీమా డబ్బులు అందేలా చూడాలని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను నింపాలని, వచ్చే వేసవి వరకు నీటి సరఫరాకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. గతంలో తిరుమలకు నీటి ఎద్దడి వచ్చినప్పుడు 100 రోజుల్లో పైపులైన్ వేసి సంక్షోభాన్ని నివారించిన విషయాన్ని గుర్తుచేశారు.

పశువుల దాణాకు కొరత రాకుండా, పచ్చదనం తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాధార పంటలను ప్రోత్సహించడం, పశుగ్రాసం పండించడం, మల్చింగ్ కోసం విత్తనాలు వేయడం వంటి పనులు చేపట్టాలన్నారు. విత్తనాలను డ్రోన్ల ద్వారా చల్లే విధానాన్ని ప్రోత్సహించాలని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. 

"విపత్తులను మనం ఆపలేం. కానీ, ప్రజలపై వాటి ప్రభావం పడకుండా చూడటమే ప్రభుత్వాల బాధ్యత. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి. అవి పూర్తయి ఉంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎల్ నినో పరిస్థితులపై ఇకపై ప్రతి వారం సమీక్ష జరుపుతానని, తాను కూడా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisement
Chandrababu Naidu
El Nino Andhra Pradesh
AP Irrigation Projects
Pattiseema Project
Drought Management Strategy
Collectors Conference Amaravati

More Telugu News