ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తా.. చేతనైతే ఆపండి!: జగన్‌కు నారా లోకేశ్ సవాల్

ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తా.. చేతనైతే ఆపండి!: జగన్‌కు నారా లోకేశ్ సవాల్

Nara Lokesh challenges Jagan says will conduct DSC every year stop me if you can
  • మెగా డీఎస్సీపై జగన్ ఆరోపణలు
  • వీడియోతో కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్
  • ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడి
  • ఐదేళ్లలో మొత్తం 30,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమదేనని స్పష్టీకరణ
  • ఉపాధ్యాయులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • త్వరలోనే తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడి
మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి తీరుతామని, చేతనైతే ఆపాలని జగన్‌కు సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో సుమారు 30 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీకి మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో లోకేశ్ ఓ వీడియో విడుదల చేశారు. 

"ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు... ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ డీఎస్సీపై మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా... డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య తేడా మీకు తెలుసా? మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లు మీరు భర్తీ చేసిన టీచర్ పోస్టులు సున్నా. అదే, మా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే పెట్టారు. అందుకే మా ప్రజాప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 

డీఎస్సీపై మీరు అనేక పర్యాయాలు కోర్టుకు వెళ్లారు. మొన్న మీ ఎమ్మెల్సీ పిల్ వేసి సీబీఐ ఎంక్వైరీ కోరితే, కోర్టు తిరస్కరించింది. డీఎస్సీ ఆపాలని మీరు 300 కేసులు వేసినా, కోర్టు ఎక్కడా మమ్మల్ని తప్పుబట్టలేదు. మా విద్యాశాఖ అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, మీరు ఆరోపిస్తున్న ప్రతి అంశానికి అద్భుతంగా సమాధానం చెప్పారు. అయినాగానీ మీరు డీఎస్సీపై విషం కక్కడం చాలా బాధాకరం. 

ఈ మధ్య నేను చూస్తున్నాను.. మీ దొంగ పేపర్ విలేకరులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, అక్కడున్న ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.. కొన్నిచోట్ల దాడులు కూడా చేస్తున్నారు. అలాంటివాళ్లను వదిలిపెట్టం, వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఉపాధ్యాయుల జోలికి ఎవరైనా వెళితే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేస్తున్నాను. 

ఈ రోజు మీరు కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో ఏదో కుంభకోణం జరిగిందని మా నాయకుడు చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు మీరు జైల్లో బంధించారు. ఈ మూడేళ్లలో న్యాయ ప్రక్రియ పూర్తయి, మా నాయకుడికి క్లీన్ చిట్ వచ్చింది. రెగ్యులేటరీ సంస్థలు కూడా చాలా స్పష్టంగా, ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పాయి. మాకు గానీ, మా కుటుంబానికి గానీ, మా పార్టీకి గానీ ఎలాంటి అవినీతి సొమ్ము రాలేదని వాళ్లు తేల్చి చెప్పారు. 

జగన్ గారూ ఒకటే చెబుతున్నాను... యువగళం పాదయాత్రలో నేను నిరుద్యోగ యువతను కలిశాను. వాళ్ల సమస్యలను తెలుసుకున్నాను. అందుకే పట్టుదలతో, క్రమశిక్షణతో ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించదలిచాను. ప్రతి సంవత్సరం 3 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఈ ఐదేళ్ల ప్రజా ప్రభుత్వంలో దాదాపు 30 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెబుతున్నాను... చేతనైతే నన్ను ఆపండి చూద్దాం. నేను వదిలిపెట్టను... అనుకున్నది సాధిస్తా.. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి తీరుతాను, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం. 

మా ప్రజాప్రభుత్వం తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయబోతోంది. యువత అందరికీ ఒకటే చెబుతున్నా... బాగా ప్రిపేర్ అవండి, అద్భుతంగా రాయండి, మంచి టీచర్లు అవండి, అందరం కలసికట్టుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుదాం" అంటూ లోకేశ్ తన వీడియోలో పేర్కొన్నారు.
Advertisement
Nara Lokesh
Jagan Mohan Reddy
Mega DSC
AP Teacher Recruitment
Andhra Pradesh Education
Annual DSC Notification

More Telugu News