మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడా’లో వెంకటేశ్వర స్వామిగా జయం రవి

మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడా’లో వెంకటేశ్వర స్వామిగా జయం రవి

Jayam Ravi as Lord Venkateswara Swamy in Manchu Manoj Vaddi Kasula Vada
  • మంచు మనోజ్ హీరోగా ‘వడ్డీ కాసుల వాడా’ చిత్రం
  • తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం
  • జయం రవి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల
  • విషెస్ తెలిపిన మంచు మనోజ్, తదితరులు 
ప్రముఖ తమిళ నటుడు జయం రవి (రవి మోహన్) ఒక ఆసక్తికరమైన పాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మంచు మనోజ్ హీరోగా దర్శకుడు తేజ్ ఉప్పలపాటి తెరకెక్కిస్తున్న ‘వడ్డీ కాసుల వాడా’ చిత్రంలో జయం రవి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించనున్నారు. గురువారం నాడు జయం రవి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

ఈ సందర్భంగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియాలో జయం రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ చేసింది. "ప్రతి ఒక్కరి హృదయంలో కొలువైన గోవిందుడి దివ్యమైన పాత్రలో మిమ్మల్ని మా ‘వడ్డీ కాసుల వాడా’ చిత్రంలోకి స్వాగతించడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం. ఈ ప్రత్యేక ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ" అని పేర్కొంది.

నిర్మాతల పోస్ట్‌పై జయం రవి స్పందిస్తూ, "ఇది నా పుట్టినరోజున లభించిన దైవాశీర్వాదం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించడం నా అదృష్టం. మనోజ్, అనిల్ సుంకర గారు, దర్శకుడు తేజ్ మరియు చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఓం నమో నారాయణ" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నటుడు మంచు మనోజ్ కూడా స్పందించారు. "మా వెంకటేశ్వర స్వామిగా మీరు నటిస్తుండటం మాకు కూడా దక్కిన ఆశీర్వాదం సోదరా. మీకు జన్మదిన శుభాకాంక్షలు. స్వామివారు మీకు ఆయురారోగ్యాలు, సంతోషం ప్రసాదించాలి" అని పేర్కొన్నారు. జయం రవి మరో పోస్టులో తన అభిమానులను దేవుడిచ్చిన ఆశీర్వాదంగా అభివర్ణించారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, 'ఘాటి' ఫేమ్ నక్క వెంకట్ స్వామి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. 'దసరా', 'జెర్సీ' వంటి చిత్రాలకు పనిచేసిన అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, దయ పన్నెం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
Advertisement
Jayam Ravi
Manchu Manoj
Vaddi Kasula Vada
Lord Venkateswara Swamy
Tej Uppalapati
AK Entertainments

More Telugu News