మెస్సీని దాటేసిన ఎంబాపే.. ప్రపంచకప్‌ గోల్స్‌లో కొత్త చరిత్ర

Kylian Mbappe becomes highest goal scorer in World Cup history
  • ప్రపంచకప్‌లో 22 గోల్స్‌
  • మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్‌
  • గోల్డెన్‌ బూట్‌ రేసులో అగ్రస్థానం
  • ప్రపంచకప్‌లో 22 మ్యాచుల్లో 22 గోల్స్‌ చేసిన ఎంబాపే
ఫిఫా ప్రపంచకప్‌ వేదికపై మరో అరుదైన రికార్డు నమోదైంది. ఫ్రాన్స్‌ కెప్టెన్‌ కిలియన్‌ ఎంబాపే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై రెండు గోల్స్‌ నమోదు చేసిన అతడు.. లియోనెల్‌ మెస్సీ రికార్డును అధిగమించాడు. మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 6-4తో ఓడిపోయినా.. వ్యక్తిగతంగా ఎంబాపే చరిత్ర సృష్టించాడు.

మియామీలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌తో ఎంబాపే ప్రపంచకప్‌లో తన మొత్తం గోల్స్‌ సంఖ్యను 22కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో 21 గోల్స్‌తో ఉన్న మెస్సీని వెనక్కి నెట్టాడు. ప్రపంచకప్‌లో ఆడిన 22 మ్యాచ్‌ల్లోనే 22 గోల్స్‌ సాధించడం మరో విశేషం. ఈ టోర్నీలో ఇప్పటికే 10 గోల్స్‌ చేసిన ఎంబాపే గోల్డెన్‌ బూట్‌ రేసులోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మెస్సీ కంటే రెండు గోల్స్‌ ముందంజలో ఉన్నాడు.

2026 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు అత్యధిక గోల్స్‌ రికార్డు మిరోస్లావ్‌ క్లోజ్‌ పేరిట ఉండేది. అయితే ఈ టోర్నీలో ముందుగా మెస్సీ ఆ రికార్డును అధిగమించాడు. అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో క్లోజ్‌ రికార్డును సమం చేసిన మెస్సీ.. ఆస్ట్రియాపై రెండు గోల్స్‌తో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత జోర్డాన్‌, కేప్‌వెర్డే, ఈజిప్టుపై కూడా గోల్స్‌ చేసి తన గోల్స్‌ సంఖ్యను మరింత పెంచుకున్నాడు.

అయితే ఎంబాపే దూకుడుకు ఆ రికార్డు ఎక్కువ రోజులు నిలవలేదు. రష్యా-2018, ఖతార్‌-2022 ప్రపంచకప్‌ల్లో చేసిన 12 గోల్స్‌కు.. 2026 టోర్నీలో మరో 10 గోల్స్‌ జోడించి మొత్తం 22 గోల్స్‌తో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. సెనెగల్‌, ఇరాక్‌, స్వీడన్‌లపై రెండేసి గోల్స్‌ చేసిన అతడు.. పరాగ్వేపై పెనాల్టీ ద్వారా ఒక గోల్‌, మొరాకోపై మరో గోల్‌ నమోదు చేశాడు. చివరగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో స్థానం మ్యాచ్‌లో మరో రెండు గోల్స్‌తో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లోనే 10 గోల్స్‌ చేసిన ఎంబాపే మరో అరుదైన ఘనతకూ చేరువయ్యాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతని కంటే ముందు హంగేరీ దిగ్గజం శాండోర్‌ కొక్సిస్‌ (11), ఫ్రాన్స్‌ లెజెండ్‌ జస్ట్‌ ఫాంటైన్‌ (13) మాత్రమే ఉన్నారు. ప్రపంచకప్‌ వేదికపై ఎంబాపే ప్రదర్శిస్తున్న అసాధారణ స్థిరత్వం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Kylian Mbappe
FIFA World Cup
Lionel Messi
World Cup Goals Record
France Football
Golden Boot

More Telugu News