సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఏపీకి వక్ఫ్ రికార్డులు అప్పగించిన తెలంగాణ

Telangana hands over Waqf records to AP ending ten year wait
  • పన్నెండేళ్ల తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి చేరిన వక్ఫ్ రికార్డులు
  • సుమారు 3,503 ఫైళ్లు, 4,050 సర్వే రిపోర్టులు స్వాధీనం
  • ఇది చారిత్రక విజయమని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వెల్లడి
  • తెలంగాణ నుంచి రూ. 55 కోట్లు కూడా రావాల్సి ఉందని వెల్లడి
రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఒక కీలక వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వేలాది వక్ఫ్ ఆస్తుల రికార్డులను తెలంగాణ వక్ఫ్ బోర్డు ఏపీకి అప్పగించింది. ఈ బదలాయింపుతో గత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.

తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి మొత్తం 3,503 ఫైళ్లు, 4,050 సర్వే కమిషనర్ నివేదికలు, రెండు అధికారిక గెజిట్ వాల్యూమ్‌లతో పాటు ఇతర కీలక పత్రాలను ఏపీ వక్ఫ్ బోర్డు అధికారులు స్వీకరించారు. ఇదొక చారిత్రక మైలురాయి అని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన కీలక ఆధారాలు ఇప్పుడు తమ వద్ద ఉన్నాయని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

2014లో రాష్ట్ర విభజన సమయంలో వక్ఫ్ చట్టం-1995 నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రికార్డులు, ఆస్తులు, నిధులు బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియ దశాబ్ద కాలానికి పైగా స్తంభించిపోయింది. కీలక రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ఆస్తుల యాజమాన్య హక్కులను నిర్ధారించడం, ఆక్రమణలను నిరోధించడం, న్యాయస్థానాల్లో కేసులను సమర్థవంతంగా వాదించడం ఏపీ వక్ఫ్ బోర్డుకు పెను సవాలుగా మారింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, ఎన్.ఎం.డి. ఫరూక్ అందించిన సహకారంతో పాటు, తాము జరిపిన ఉన్నత స్థాయి చర్చలు ఫలించాయని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. ఈ రికార్డుల లభ్యతతో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను క్రమబద్ధీకరించడం, వివాదాలను వేగంగా పరిష్కరించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఇదే క్రమంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి ఏపీకి సుమారు రూ. 55 కోట్ల నిధులు రావాల్సి ఉందని, అవి కూడా త్వరలోనే విడుదలవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
AP Waqf Board
Telangana Waqf Board
Waqf property records
Andhra Pradesh bifurcation
Abdul Aziz

More Telugu News