పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. గల్ఫ్‌లో భారత నావికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం

West Asia tensions Central government key decision for Indian sailors in Gulf
  • భారత నావికుల వివరాలు నమోదు చేయాలన్న కేంద్రం
  • నౌకలపై ప్రత్యేక రియల్‌టైమ్‌ డ్యాష్‌బోర్డ్‌ ఏర్పాటుకు ఆదేశం
  • వాణిజ్య నౌకలపై దాడులను ఖండించిన భారత్‌
  • భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం పెంచాలని నిర్ణయం
  • భద్రత, వైద్య సాయంపై నిరంతర సమాచారం సేకరణ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ గల్ఫ్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి భారత నావికుడి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నౌక ఏ దేశ జెండాతో ప్రయాణిస్తున్నా.. అందులో పనిచేస్తున్న ప్రతి భారతీయుడిపై పూర్తి సమాచారం ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌కు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదేశాలు జారీ చేశారు. పర్షియన్‌ గల్ఫ్‌, హర్మూజ్‌ జలసంధి, ఒమన్‌ గల్ఫ్‌లో ప్రయాణిస్తున్న ప్రతి నౌకపై ప్రత్యేక ఆపరేషనల్‌ డ్యాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ డ్యాష్‌బోర్డ్‌లో నౌక ఉన్న ప్రాంతం, యాజమాన్యం, సరకు వివరాలు, సిబ్బంది సంఖ్య, భారతీయ నావికుల సంక్షేమం, భద్రతా పరిస్థితి, ప్రయాణ మార్గం, చేరాల్సిన పోర్టు, అందుబాటులో ఉన్న సౌకర్యాల వంటి సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది.

వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించిందని సోనోవాల్‌ తెలిపారు. ఈ దాడుల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం తీవ్ర వేదన కలిగించిందని చెప్పారు. ప్రపంచ సరఫరా వ్యవస్థ కొనసాగడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత నావికులపై ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఇరాన్‌, ఒమన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని భారత రాయబార కార్యాలయాలు, విదేశాంగ శాఖతో సమన్వయం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నౌకాయాన భద్రత, ప్రత్యామ్నాయ పోర్టులు, వైద్య సాయం, తరలింపు, స్వదేశానికి పంపే ఏర్పాట్లు, దర్యాప్తు పురోగతిపై ఎప్పటికప్పుడు ధ్రువీకరించిన సమాచారం సేకరించాలని సూచించారు.

అలాగే గల్ఫ్‌ ప్రాంతంలో భారతీయ నావికులను నియమించిన షిప్పింగ్‌ కంపెనీలు, నౌకల నిర్వహణ సంస్థలు, రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పూర్తి సమాచారం, భద్రత, అవసరమైన సాయం లేకుండా ఏ భారతీయ నావికుడినీ విధులకు పంపొద్దని స్పష్టం చేశారు.
Advertisement
Sarbananda Sonowal
Indian Sailors Safety
West Asia Tensions
Persian Gulf Ship Tracking
Ministry of Ports Shipping and Waterways
Gulf of Oman Security

More Telugu News