ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్

Deputy CM Pawan Kalyan discharged from Mumbai hospital
  • భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి
  • కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.

గత కొంతకాలంగా రెండు భుజాలకు సంబంధించిన 'రొటేటర్ కఫ్' సమస్యలతో బాధపడుతున్న పవన్ కల్యాణ్, చికిత్స నిమిత్తం ఈ నెల 10న ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజానికి వైద్యులు సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ అనంతరం గత నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొన్ని రోజుల పాటు సంపూర్ణ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాగా, పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన త్వరగా కోలుకొని విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.

పవన్ కల్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వార్త తెలియడంతో జనసేన శ్రేణులు, కూటమి నేతలు మరియు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.                                
Advertisement
Pawan Kalyan
Andhra Pradesh Deputy CM
Kokilaben Dhirubhai Ambani Hospital
Pawan Kalyan shoulder surgery
Janasena Party
Mumbai hospital discharge

More Telugu News