ఇది ఇండియాలో మాత్రమే సాధ్యం.. అమెరికన్ మహిళ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

Only Possible in India American Woman Instagram Post Viral
  • భారత వైద్య వ్యవస్థపై ఓ అమెరికన్ మహిళ ప్రశంసల వర్షం
  • ముంబైలో రక్త పరీక్ష కోసం ఇంటికే సిబ్బందిని పంపిన క్లినిక్
  • అమెరికాతో పోలిస్తే టెస్ట్ ధర 10వ వంతు మాత్రమేనని కితాబు 
  • ఇంటికి వచ్చి సేవలు అందించినందుకు ఎలాంటి అదనపు రుసుము లేకపోవడంతో ఆశ్చర్యం
భారత వైద్య వ్యవస్థ ఎంత వేగంగా, సౌకర్యవంతంగా ఉంటుందో వివరిస్తూ ఓ అమెరికన్ మహిళ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక్కడి వైద్య సేవలు తనను ఎంతగా ఆక‌ట్టుకున్నాయో ఆమె తన అనుభవం ద్వారా పంచుకున్నారు. ఈ సంఘటన మన దేశ హెల్త్‌కేర్ రంగం గొప్పతనాన్ని, అందుబాటు ధరలను మరోసారి ప్రపంచం ముందు ఉంచింది.

వివరాల్లోకి వెళితే.. 'స్పైసీగోరి' (@spicygori) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్, అమెరికాకు చెందిన మహిళ, ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమెకు రక్త పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికాలో మాదిరిగా క్లినిక్‌కు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుందని ఆమె భావించారు. అయితే, అపాయింట్‌మెంట్ కోసం క్లినిక్‌కు ఫోన్ చేయగా, వారు చెప్పిన సమాధానం ఆమెను ఆశ్చర్యపరిచింది. మీరు రావాల్సిన అవసరం లేదని, తమ సిబ్బందినే మీ ఇంటికి పంపిస్తామని చెప్పారు.

చెప్పినట్టుగానే, ఓ హెల్త్‌కేర్ టెక్నీషియన్ వారి ఇంటికి వచ్చి, కేవలం ఐదు నిమిషాల్లోనే రక్త నమూనాలను సురక్షితంగా సేకరించి వెళ్లారు. ఈ ప్రక్రియ మొత్తం ఎంతో వేగంగా ముగిసిపోవడం ఆమెను అబ్బురపరిచింది.

అయితే, ఆమెను అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం దాని ఖర్చు. అమెరికాలో అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇక్కడ రక్త పరీక్ష ధర 10వ వంతు మాత్రమేనని ఆమె గుర్తించారు. "పరీక్ష ధర చాలా తక్కువగా ఉండటంతో, ఇంటికి వచ్చి సేవలు అందించినందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తారని అనుకున్నాను. కానీ, వాళ్లు చెప్పింది విని ఆశ్చర్యపోయాను. హోమ్ కలెక్షన్ సేవ పూర్తిగా ఉచితం" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 'ఇది ఇండియాలో మాత్రమే సాధ్యం' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి 15 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ పోస్ట్‌తో ఇత‌ర‌ దేశాల్లోని ఖరీదైన వైద్య వ్యవస్థకు, భారతదేశంలోని చౌకైన, సమర్థవంతమైన వైద్య సేవలకు మధ్య ఉన్న తేడాపై విస్తృతమైన చర్చ మొదలైంది. నెటిజన్లు కూడా ఆమె పోస్ట్‌కు సానుకూలంగా స్పందిస్తున్నారు. "భారత్ జీవించడానికి గొప్ప ప్రదేశం", "వృద్ధులు, గర్భిణులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరం", "వైద్యం, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ ఒక సూపర్ పవర్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Spicygori
Indian Healthcare System
Home Blood Collection
Mumbai Medical Services
India vs USA Healthcare
Viral Instagram Post

More Telugu News