గోవధ కేసు.. సీఎం విజయ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట!

Supreme Court relief to Tamil Nadu Government in cow slaughter case
  • ఏ రోజూ రాష్ట్రంలో ఆవులను వధించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
  • ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • పదేళ్లు దాటిన లేదా సంతానోత్పత్తికి పనికిరాని జంతువుల వధకు అనుమతి ఉందని వాదన
  • హైకోర్టు ఉత్తర్వులకు సవరణ అవసరమన్న సుప్రీంకోర్టు
ఆవులు, దూడల వధపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలకు సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. బక్రీద్ సందర్భంగా మాత్రమే కాకుండా ఏ రోజూ రాష్ట్రంలో ఆవులు, దూడలను వధించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

1958 తమిళనాడు జంతు సంరక్షణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు సంపూర్ణ నిషేధం విధించిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ చట్టం ప్రకారం 10 ఏళ్లు దాటిన లేదా వ్యవసాయం, సంతానోత్పత్తికి పనికిరాని పశువులకు సంబంధిత అధికారుల ధ్రువీకరణతో వధకు అనుమతి ఉందని ప్రభుత్వం వాదించింది. అలాంటి చట్టపరమైన వెసులుబాట్లు ఉన్నప్పటికీ అన్ని సందర్భాల్లోనూ వధను పూర్తిగా నిషేధించడం చట్ట పరిధిని మించిపోయిన చర్య అని పేర్కొంది.

వాదనలు విన్న సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు ‘‘సవరణ అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదుల నుంచి సమాధానం కోరుతూ విచారణను వాయిదా వేసింది.

బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా ఆవులను వధిస్తున్నారని ఆరోపిస్తూ ఇండు మక్కల్ కట్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, అధికారికంగా గుర్తింపు పొందిన కబేళాల్లో మాత్రమే జంతువుల వధ జరగాలని స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్-48ను ప్రస్తావిస్తూ ఆవులు, దూడల వధను నిరోధించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు చట్టాన్ని మించిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
Advertisement
Supreme Court
Cow slaughter ban
Madras High Court
Tamil Nadu Government
Animal Preservation Act
Bakrid cow slaughter

More Telugu News