ఇరాన్‌పై అమెరికా ముప్పేట దాడులు.. 24 గంటల్లో మూడోసారి విరుచుకుపడిన యూఎస్ సేనలు!

United States triple attacks on Iran US forces strike for the third time in 24 hours
  • హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి.. అమెరికా ప్రతీకారం
  • 24 గంటల్లో మూడోసారి దాడులు.. 300కి పైగా ఇరాన్ లక్ష్యాలు ధ్వంసం
  • అమెరికా దాడులకు బదులుగా కువైట్‌పై ఇరాన్ ఎదురుదాడులు
  • తక్షణమే దాడులు ఆపాలన్న ఐక్యరాజ్యసమితి
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడటంతో అమెరికా భారీ ఎత్తున ప్రతీకార దాడులు ప్రారంభించింది. గత 24 గంటల్లో ఇది మూడోసారి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనగా, అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర, వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది. ఇరాన్ దళాలను జవాబుదారీగా చేయాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారని తెలిపింది. గత మూడు రాత్రుల్లో దాదాపు 300కి పైగా ఇరాన్ సైనిక లక్ష్యాలను, క్షిపణి వ్యవస్థలను, వాయు రక్షణ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. తాజా దాడులు ఇరాన్ తీర ప్రాంతాలపై కేంద్రీకృతమయ్యాయని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో పేర్కొంది.

అమెరికా దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ దళాలు ఓ పౌర నౌకపై కాల్పులు జరపడం గమనార్హం. అయితే, వెంటనే రంగంలోకి దిగిన అమెరికా యుద్ధ విమానాలు.. ఇరాన్‌కు చెందిన ఒక క్రూయిజ్ క్షిపణిని, ఒక దాడి డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయని సెంట్‌కామ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ధ్రువీకరించారు. ఈ దాడులతో దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అయితే, పౌర నష్టం జరగలేదని ప్రాథమికంగా వెల్లడించింది.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం ఎదురుదాడులకు దిగింది. పొరుగున ఉన్న కువైట్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో తమ సరిహద్దులోని మూడు పోస్టులు దెబ్బతిన్నాయని కువైట్ ప్రకటించింది. అలాగే కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌పై డ్రోన్ దాడి జరగ్గా, ఒక కార్మికుడు గాయపడ్డాడు. కువైట్‌లోని అమెరికా 'హిమార్స్' రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించగా, ఆ ప్రచారాన్ని సెంట్‌కామ్ ఖండించింది. తమ సైనికులెవరూ గాయపడలేదని స్పష్టం చేసింది.

గల్ఫ్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు వెంటనే దాడులను నిలిపివేయాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిమాండ్ చేశారు. ఈ ఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మారితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ భద్రతకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ఇరు దేశాలు పంతాలు వీడి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
United States
Iran
Strait of Hormuz
US Central Command
Middle East conflict
Military air strikes

More Telugu News