బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

Bangkok Pub Fire Accident Kills 27 People at Na Ladprao Pub
  • మరో 63 మందికి తీవ్ర గాయాలు.. 22 మంది పరిస్థితి విషమం
  • దట్టమైన పొగ కారణంగా ఊపిరాడకే ఎక్కువ మంది మృతి
  • ఫైర్ ఎగ్జిట్ వద్ద అడ్డంకుల వల్లే భారీగా ప్రాణనష్టం 
  • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రముఖ పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. పబ్ ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి, భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

ఉత్తర బ్యాంకాక్‌లోని 'నా లాడ్‌ప్రావ్' పబ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపంత్ మాట్లాడుతూ.. మంటలు వేగంగా పైకప్పు వరకు వ్యాపించాయని, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడకపోవడమే అధిక మరణాలకు ప్రధాన కారణమని తెలిపారు. గాయపడిన వారిలో 22 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. చాలా మృతదేహాలు పబ్ వెనుక ఉన్న రెస్ట్‌రూమ్‌లలో లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర ద్వారం (ఫైర్ ఎగ్జిట్) వద్ద కొన్ని అడ్డంకులు ఉండటంతో, లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని అధికారులు భావిస్తున్నారు. థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఓ మ్యూజీషియన్ ఆయనతో మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి ముందు స్టేజ్ పక్కన ఉన్న సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగలు రావడం చూశానని, ఆ వెంటనే పెద్ద పేలుడు వినిపించిందని వివరించాడు.

ఈ ప్రమాదంలో తన బ్యాండ్‌లోని ఒకరు మరణించగా, మరొకరి ఆచూకీ తెలియడం లేదని స్థానిక గాయని సుకన్య వాంగ్‌వాంగ్వాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు వ్యాపించగానే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా చీకటిమయమైందని, పొగ వల్ల ఏమీ కనిపించక చాలామంది లోపలే చిక్కుకుపోయారని బాధితులు చెబుతున్నారు. పబ్ యాజమాన్యం భద్రతా నిబంధనలను ఉల్లంఘించిందా అనే కోణంలో అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
Advertisement
Bangkok Pub Fire
Thailand Fire Accident
Na Ladprao Pub
Anutin Charnvirakul
Chadchart Sittipunt
Bangkok Fire Deaths

More Telugu News