ఫిన్లాండ్ లో భారతీయ విద్యార్థి మిస్సింగ్... ఆ మృతదేహం తమ కుమారుడిది కాదంటున్న తల్లిదండ్రులు!

Indian student missing in Finland parents claim body found is not their son
  • ఫిన్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి మణిదీప్ కేసులో కీలక మలుపు
  • లభ్యమైన మృతదేహం మణిదీప్‌దేనన్న ఫిన్లాండ్ పోలీసులు
  • అది మా అబ్బాయిది కాదంటూ తిరస్కరించిన కుటుంబ సభ్యులు
  • దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
  • న్యాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి 
ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లి మే 5న అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మణిదీప్ రెడ్డి గుజ్జ (18) కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సముద్ర తీరంలో లభ్యమైన ఒక మృతదేహం మణిదీప్‌దేనని ఫిన్లాండ్ పోలీసులు ప్రకటించగా, ఆ వాదనను అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. లభించిన మృతదేహం తమ కుమారుడిది కాదని వారు స్పష్టం చేయడంతో ఈ కేసులో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.

కేసు వివరాల్లోకి వెళితే.. సముద్ర తీరంలో ఒక మృతదేహం లభించిందని, బయోమెట్రిక్ డేటా, వ్యక్తిగత వస్తువుల ఆధారంగా అది మణిదీప్‌దేనని ప్రాథమికంగా గుర్తించినట్లు ఫిన్లాండ్ పోలీసులు ఈమెయిల్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఫిన్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సైతం ఈ విషయాన్ని మణిదీప్ తల్లిదండ్రులకు తెలియజేసింది. అయితే, పోలీసుల ప్రకటనను మణిదీప్ తండ్రి జి. ముత్యం రెడ్డి తోసిపుచ్చారు. సదరు మృతదేహం తమ కుమారుడిది కాదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

సుమారు 65 రోజుల తర్వాత ఇప్పుడు మృతదేహం లభించడంపై కుటుంబ సభ్యులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నిబంధనల ప్రకారం మూడు వారాల్లో కేసును మూసివేయాలనే ఒత్తిడితో, ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని తమ కుమారుడికి ఆపాదిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాము అనుమానిస్తున్న వ్యక్తిపై పోలీసులు సరైన విచారణ జరపలేదని, అన్వేషణ నిమిత్తం ఫిన్లాండ్ వెళ్లేందుకు వీసాల మంజూరులో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన మణిదీప్ రెడ్డి, లాహ్టిలోని లప్పిన్‌రాంటా-లాహ్టి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (LUT)లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మే 5న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన అతను, అనంతరం యూనివర్సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెల్సింకి నగరానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. అక్కడి ఒక షాపింగ్ మాల్‌లోని సీసీటీవీ ఫుటేజీలో అతను చివరిసారిగా కనిపించాడు.

మణిదీప్ అదృశ్యంపై కేసు నమోదు కాగా, ఫిన్లాండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (NBI) దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో, బాధితుని ఆచూకీ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఈ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని మణిదీప్ కుటుంబం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.                                
Advertisement
Manideep Reddy Gujja
Finland student missing case
Hyderabad student in Finland
LUT University student missing
Indian Embassy Finland
Mutyam Reddy

More Telugu News