తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు.. రూ.1.80 కోట్ల బకాయిల వివాదం

Cheating case filed against Tamil hero Arya in Hyderabad over 180 crore dues
  • హైదరాబాద్‌కు చెందిన టెక్నిక్ సంస్థ ఫిర్యాదుతో కేసు
  • మలయాళ చిత్రం 'అనంతన్ కాడు' షూటింగ్ కోసం పరికరాల వినియోగం
  • డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపణ
ప్రముఖ తమిళ నటుడు ఆర్య (జంషెడ్ సి)తో పాటు ఆయన నటించిన మలయాళ చిత్రం ‘అనంతన్ కాడు’ నిర్మాతలపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మోసం (చీటింగ్) కేసు నమోదైంది. సినిమా షూటింగ్ నిమిత్తం వినియోగించిన పరికరాల అద్దె బకాయిలు రూ.1.80 కోట్లకు పైగా చెల్లించలేదని ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్‌కు చెందిన ‘తాహెర్ సినీ టెక్నిక్’ సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ‘అనంతన్ కాడు’ సినిమా చిత్రీకరణ కోసం 2025 ఫిబ్రవరిలో నటుడు ఆర్య, నిర్మాత వినోద్ తమ సంస్థను సంప్రదించినట్లు ఆయన పేర్కొన్నారు. తమ సంస్థకు చెందిన ఖరీదైన కెమెరాలు, లైటింగ్ యూనిట్లను హైదరాబాద్ నుంచి కేరళకు తరలించామని, అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత చెల్లించాల్సిన మొత్తం రూ.2.12 కోట్ల అద్దెలో మెజారిటీ వాటాను ఎగవేసినట్లు వివరించారు.

బకాయిలు చెల్లిస్తామని పలుమార్లు హామీ ఇచ్చి, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని బాధితులు ఫిర్యాదులో వెల్లడించారు. వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించినా స్పందన లేదని, పైగా బాకీ డబ్బుల గురించి అడిగిన తమ మేనేజర్‌ను నిర్మాతతో పాటు ఆర్య, ఆయన వ్యక్తిగత సహాయకుడు కిషోర్ బెదిరించారని ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చి కేరళలోని న్యాయస్థానం నుంచి వీరు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందారని వారు తెలిపారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం వెల్లడించారు.                       
Advertisement
Arya
Cheating case Hyderabad
Ananthan Kadu movie
Taher Cine Technique
Jubilee Hills Police
Tamil actor Arya news

More Telugu News